రెండో దశ పూడిక తీత పనులు వెంట‌నే ప్రారంభించాలి

  • కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం
  • నీటి సామర్ధ్యం పెంపున‌కే పూడిక తీతకు శ్రీకారం
  • ప్రాజెక్టుల్లో పూడిక‌వ‌ల్ల నీటి నిలువ సామర్ధ్యం పడి పోయింది
  • వర్షాకాలనికి ముందే పూడిక తీత పనులు పూర్తి చేయాలి
  • ఆధునిక ప‌రిజ్ఞానంతో పూడిక‌తీత ప‌నులు
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27:  మట్టితో పేరుకు పోయిన ప్రాజెక్టులలో రెండోదశ పూడిక తీత పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam kumar Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో   నీటిపారుదల శాఖా అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  వర్షాకాలానికి ముందే పూడికతీత పనులకు ఉపక్రమిస్తే వర్షాకాలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టులలో నీటి సామర్ధ్యం పూర్తిగా పడి పోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందన్నారు.

జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ఈ సంక్షోభంనుండి బయటపడి రైతాంగానికి నీటి భద్రత కల్పించేందుకు కేంద్రం జాతీయస్థాయిలో  తీసుకొచ్చిన పూడిక తీత విధానం కింద‌ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పూడిక తీత పనులకు అంకురార్పణ చుట్టిందని ఆయన పేర్కొన్నారు. చారిత్రాత్మక భ‌క్రా నంగల్ నుండి తెలంగాణా రాష్ట్రంలో సుప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు మట్టితో పూడి పోయి నీటిసామర్ద్యం నిలువలు పడి పోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 120 టి.యం.సి ల సామర్ధ్యం నుండి ఏకంగా 80 టి.యం.సి లకు పడిపోయిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. మట్టితో లేదా ఇసుక మేటలతో ప్రాజెక్టులు పడిపోయి నీటి సామర్ధ్యం నిలువలు ఘోరంగా పడిపోయి ఇది జాతీయ స్థాయి సమస్యగా పరిణమించినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటిదశ లో చేపట్టిన పూడిక తీత పనులు జాతీయస్థాయిలో పూడికతీతకై చేపట్టిన మార్గదర్శనంలొనే తెలంగాణా ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  పూడికతీత పనులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు గాను ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పూడిక తీత పనులను ఆయన ప్రస్తావిస్తూ పైలెట్ ప్రాజెక్ట్ కింద “కడెం” ప్రాజెక్టులో మొదటి దశ లో చెపట్టి న పూడిక తీత విజయవంతం అయ్యిందన్నారు .ఇక్కడ పూర్తిగా అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో ఉండాల్సిన నీటి సామర్ధ్యం నిలువలు…వర్షాల ఉధృతికి వచ్చి చేరే నీటితో ఏర్పడ్డ నీటినిలువలు సమగ్రంగా అధ్యయనం జరిపి అంతిమ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నూతనంగా నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఇ. శ్రీధర్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి రమేష్ బాబు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *