-తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చరిత్రాత్మకం
-రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు
-నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్
సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 14: నిరుపేదలకు తెల్లరేషన్ కార్డుల పంపిణీ మంజూరులో యావత్ భారత్‌కే తెలంగాణ రాష్ట్రం ఓ రోల్ మోడల్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల పంపిణీలో రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఇందుకోసం సుమారు 5.61 లక్షలపై చిలుకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసి రాష్ట్ర జనాభాలో 80 శాతం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేెస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను అందజేస్తామని, కొత్త తెల్ల కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ు ఎవరూ వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఆహార భద్రతకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పెద్ద పీట వేయడంతోపాటు యుపిఏ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక చట్టాన్ని రూపొందని ఆయన గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోగా కనీసంలో కనీసం అప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో కొత్త సభ్యులను కూడా చేర్పించ లేకపోయారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రం తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు తెరలేపి లబ్ది పొందారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడవుగా అర్హులైన నిరుపేదలకు కొత్త తెల్ల కార్డులు మంజూరు చేయడంతోపాటు అప్పటికే ఉన్న తెల్ల కార్డులలో కుటుంబ సభ్యులను చేర్పించే ప్రక్రియ చేపట్టామన్నారు. ఏక కాలంలో 5.6 లక్షల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు రాష్ట్ర జనాభాలో 80 శాతంపై చిలుకు జనాభాకు ఒక్కో వ్యక్తికి ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకీ వచ్చినప్పుడు పౌర సరఫరాల శాఖ పూర్తిగా రూ.59,వేల కోట్ల అప్పులతో రూ.11,000 వేల కోట్ల నష్టాలతో పౌర సరఫరాల శాఖ మిగిలి పోయిందని తెలిపారు. అలాంటి పరిస్థితిలలో అధికారంలోకి వచ్చిన తాము పౌర సరఫరాల శాఖను స్థిరీకరించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, 18 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో శాఖ పూర్వ స్థితికి వచ్చిందని చెప్పారు. గడిచిన ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు ఇష్టపడకపోవడంతో అవి పక్కదోవ పట్టి అనేక అక్రమాలకు తెరలేచాయని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యయనం చేసి నిరుపేదలకు కడుపు నిండేలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. అందుకోసం రూ.13,000 కోట్లు అదనపు ఖర్చు పెట్టి పేద ప్రజలందరికీ సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. అదే సమయంలో సన్న బియ్యం పంపిణీకి సరిపడ ధాన్యం ఉత్పత్తికి ముందెన్నడూ లేని రీతిలో రూ.500 బోనస్ ఇచ్చి సన్నాలను ప్రోత్సాహించామని స్పష్టం చేశారు. రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలతో రాష్ట్రంలో రికార్డు స్థాయి ధాన్యం దిగుబడి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కాగా, దేశ చరిత్రలోనే 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసిన ఏకైక రాష్ట్రంగా నేడు తెలంగాణ రికార్డు సృష్టించిందని చెప్పారు. అనంతరం రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎమ్మెల్యే సామేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.





