– సమాజ హక్కుల రక్షకులు న్యాయవాదులు
– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నోవాటెల్ హెచ్‌ఐసీసీలో లెక్స్ విట్‌నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రాండ్ మాస్టర్ 2025-హైదరాబాద్ ఎడిషన్’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఒక న్యాయవాదిగానే నా ప్రస్థానం మొదలయ్యింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటికీ ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి.. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగింది.. ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్ కోర్టు రూమ్‌లు, రియల్ టైమ్ కేసు ట్రాకింగ్, ఈ-ఫైలింగ్ వంటివి అందుబాటులోకొచ్చాయ’ని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదని, సమానత్వాన్ని అందించే వాస్తు శిల్పులని, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షకులని కొనియాడారు. ఇప్పుడు న్యాయవాదులు అంటే కేవలం న్యాయ నిపుణులు మాత్రమే కాదు.. బిజినెస్ ఎనేబులర్లు.. కంప్లియెన్స్ నావిగేటర్లు.. టెక్ ఇంటిగ్రెటేడ్ అడ్వైజర్లు అని వివరించారు. అడ్మినిస్ట్రేషన్‌పరంగా న్యాయపరమైన కార్యకలాపాల కోసం 63 శాతం పెద్ద భారతీయ కంపెనీలు ఏఐ, ఆటోమేషన్‌పైనే ఆధారపడుతున్నాయని నాస్కామ్ లీగల్ టెక్ రిపోర్ట్-2025 స్పష్టం చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో 120కి పైగా స్టార్టప్ కంపెనీలు ఈ-డిస్కవరీ, డిస్ప్యూట్ అనలిటిక్, వర్చువల్ ఐపీఆర్ ప్లాట్‌ఫామ్స్ తదితర రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయని శ్రీధర్‌బాబు చెప్పారు. దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో 5.15 కోట్లకు పైగా కేసులు పెండిరగ్‌లో ఉన్నట్లు గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించిందని, వీటిలో కేవలం జిల్లా న్యాయస్థానాల్లోనే 4.56 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, తెలంగాణలోనూ 10 లక్షలకు పైగా కేసులు పెండిరగ్‌లో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయంటూ ఆలస్యమైన న్యాయం నిరాకరించబడిన న్యాయంతో సమానం అని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు
న్యాయవాద వృత్తిని జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు.. సమాజం పట్ల ఒక బాధ్యతగా భావించాలి.. చట్టాన్ని తెలుసుకోవడమే కాదు.. మార్పులకనుగుణంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే నేర్పును అలవర్చుకోవాలి అని యువ న్యాయవాదులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. నిజమైన క్లయింట్ కేవలం మిమ్మల్ని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ మాత్రమే కాదు.. మీపై ఆధారపడిన వ్యవస్థ అని కూడా గుర్తించాలన్నారు. రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందించేందుకు కృషిచేయాలని, ఎల్లప్పుడూ న్యాయం పక్షానే ఉండాలి అని అన్నారు. కార్యక్రమంలో లెక్స్ విట్‌నెస్ ప్రతినిధులు అభిజిత్, శ్రీనివాస్, పలు కంపెనీల లీగల్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.



