మా లక్ష్య సాధనలో పాలుపంచుకోండి

– పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు
– యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హెచ్‌ఐసీసీలో యూఏఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇన్వెస్టోపియా గ్లోబల్‌ పేరిట గురువారం నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. భౌగోళికంగా చిన్నదైనా ఆశయాలు, ఆచరణలో మాత్రం తెలంగాణ చాలా పెద్దదని, స్వల్ప కాలంలోనే ఫీనిక్స్‌ పక్షిలా ఎదిగి ఇతర రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 2024-25లో జీఎస్‌డీపీలో 8.2 శాతం వృద్ధి నమోదైందని, ఇది జాతీయ సగటు(7.6%) కంటే ఎక్కువని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతానికి పైగా ఉంది అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలో డ్రై పోర్టులు, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నెట్‌-జీరో పారిశ్రామిక పార్కులు, ఈవీ జోన్లు, గ్రీన్‌ లాజిస్టిక్స్‌ హబ్‌లు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌), మెట్రో ఫేజ్‌-2 వంటివి పారిశ్రామికాభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నాయన్నారు. ఫ్యూచర్‌ సిటీ ఫిన్‌టెక్‌, క్లైమేట్‌-టెక్‌, స్మార్ట్‌ మొబిలిటీ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారబోతోందన్నారు. డేటా సెంటర్లు, గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు(జీసీసీ), ఏఐ ల్యాబ్‌లు, ఏరోస్పేస్‌ క్లస్టర్లలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోందని పేర్కొన్నారు. ఈ18 నెలల్లో తెలంగాణ కొత్తగా రూ.3.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించిందని, 2024-25లో యూఏఈకి తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయని, ఫార్మా, ఏరోస్పేస్‌, డిజిటల్‌ సేవలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కీలక పాత్ర పోషించాయని, ఇప్పటికే యూఏఈకి చెందిన లులు గ్రూప్‌, డీపీ వరల్డ్‌, నాఫ్కో వంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి అని తెలిపారు. ఇది ఒక పెట్టుబడి సదస్సు మాత్రమే కాదు.. పాత స్నేహితుల కలయిక,. భవిష్యత్తుకు ఒక లాంచ్‌ప్యాడ్‌.. యూఏఈలాగే తెలంగాణ కూడా సమయం, నమ్మకం, పరివర్తనకు విలువ ఇస్తుందని చెప్పారు. ఇక్కడ ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, లైఫ్‌ సైన్సెస్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌, ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆగ్రో ఎగుమతులు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్మార్ట్‌ మొబిలిటీ, పర్యాటకం, వెల్‌నెస్‌, మెడికల్‌ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ, టూరిజం అబ్దుల్లా బిన్‌ తాక్‌ అల్‌ మర్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సంజయ్‌ కుమార్‌, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ ది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ మహ్మద్‌ అల్వాహీ, యూఏఐ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ వాలిద్‌ హరేబ్‌ అల్‌ ఫలాహి, ఇన్వెస్టోపియా సీఈవో డా.జీన్‌ ఫారెస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *