పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబు

మహాముత్తారం, ప్రజాతంత్ర, జులై 14: ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మహా ముత్తారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, రూ.73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలతో రూపొందిన ఈ భవనాలు మండల పరిపాలనకు, వ్యవసాయ సహకార సేవలకు ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని తెలిపారు. అంతకుముందు అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలకు టైలరింగ్‌లో మెళకువలు నేర్పేందుకు అనుభవజ్ఞులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమాలలో సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాసరావు, సహకార అధికారి వాలియా నాయక్‌, వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌ రెడ్డి, సీఈఓ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *