ప్రజాప్రతినిధుల కోర్టుకు సీతక్క హాజరు

– కోవిడ్‌ కాలంలో నిరసనలపై కేసుల్లో..
– ఆగస్టు 13కు విచారణ వాయిదా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: కోవిడ్‌ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కనాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. రూ.10 వేలతో రెండు షూరిటీలు కోర్టులో దాఖలు చేయగా విచారణ ఆగస్టు 13కు వాయిదా పడిరది. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్కు వద్ద ఏప్రిల్‌ 2021 ఏప్రిల్‌లో నిరసన దీక్ష చేపట్టగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతోందని ఆరోపించారు. కోర్టులపై పూర్తి విశ్వాసం ఉందని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషులుగా నిరూపించుకుంటామని అన్నారు. తనతోపాటు ఎన్‌ఎస్‌యూఐ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, హైదరాబాద్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు అభిజిత్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని ఆమె చెప్పారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ల్లో లక్షలు వెచ్చించలేక కరోనాతో ఎందరో ప్రాణాలు కోల్పోయారని, అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ధర్నా చేపట్టామని తెలిపారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచిన చరిత్ర తమది అని, అలాంటి తమపై కరోనాను వ్యాప్తిచేస్తున్నామని కేసీఆర్‌ కేసులు నమోదు చేశారని, ఇదే విషయమై తమ సీనియర్‌ న్యాయవాదులు కృష్ణకుమార్‌ గౌడ్‌, ఎస్‌ఎస్‌ రావు, నరేందర్‌ వాదనలు వినిపించారని చెప్పారు. తదుపరి విచారణను ఆగస్టు 13కు కోర్టు వాయిదా వేసిందని, కెసిఆర్‌ తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *