నల్గొండను నంబర్‌ వన్‌గా నిలుపుతా

– ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు నా చిరకాల కోరిక
– సీఎం సహకారంతో విద్యా వ్యవస్థలో మార్పులకు యత్నిస్తున్నాం
– విద్యా శాఖాధికారులతో మంత్రి కోమటి రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నల్గొండను అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ ప్రజలు తనను ఆశీర్వదిస్తూ వస్తున్నారని, వారి ఉన్నతి కోసం ఎంత చేసనా తక్కువేనంటూ భావోద్వేగానికి గురాయ్యరు. రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాలేజీ, స్కూల్‌ ఎడ్యుకేషన పై ఆ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమని, దాని ఖ్యాతిని పెంచేలా వీసీ, రిజిస్ట్రార్‌, పాలక మండలి సభ్యులు పనిచేయాలని మంత్రి సూచించారు. యూనివర్శిటీకి ప్రత్యేకంగా రూ.60.22 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేశామంటూ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్‌ చేస్తున్నందున కొత్త కోర్సులపై ఆరా తీశారు. విశ్వవిద్యాలయంలో కొత్తగా ఫార్మసీ, ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సులు ప్రారంభించేందుకు చొరవ చూపాలని వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌ మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహకారంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని, అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు వచ్చారని చెప్పారు. నల్గొండలో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసి, లా కాలేజీ ఏర్పాటు చేయాలనేది తన చిరకాల కోరికని, అందుకనుగుణంగా చర్యలు చేపట్టామని, త్వరలో నూతన కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, హైస్కూల్స్‌ బలోపేతంపై చర్చించి అందుకు విద్యాశాఖ అధికారులు అందించాల్సిన సహకారంపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు. సమీక్షలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, సాంకేతిక, ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ దేవసేన, రిజిస్ట్రార్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *