క్షతగాత్రులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ, ప్రణామ్‌ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. వారి ఆరోగ్యం కుదుటపడే వరకూ హాస్పిటల్స్‌లోనే ఉండి వారికి అవసరమైన వైద్య సహాయక సేవలు అందించాలని డీఎంహెచ్‌వోను, ఇతర మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులను హాస్పిటల్‌ వద్ద మంత్రి పరామర్శించి ఓదార్చారు. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారికి మంత్రి భరోసానిచ్చారు. చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన, మృతిచెందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *