– ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
దేవరకొండ, ప్రజాతంత్ర, జులై 27: గత ప్రభుత్వ హయాంలో పేదల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారుని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 5,28,153 రేషన్ కార్డులు పంపిణీ చేశామని, ఇంత భారీ స్థాయిలో పేదలకు మద్దతుగా రేషన్ కార్డులు అందజేయడం గర్వంగా భావిస్తున్నామని అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా పేదల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా చింతపల్లి మండలంలోని సాయిబాబా ఆలయంలో మంత్రి అడ్లూరికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధి నిధుల ద్వారా రూ.1.35 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద నిధుల విడుదల, 3,500 ఇళ్లకు ఇందిరమ్మ పథకం మంజూరు, సబ్సిడీ బియ్యం పంపిణీ వంటివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేదల పట్ల ఉన్న ప్రేమకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అభ్యర్థన మేరకు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన విషయాన్ని సానుకూలంగా పరిశీలించి త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు జమున మాధవరెడ్డి, సంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొండ శ్రీశైలం, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు, ఎంపీడీవోలతోపాటు ఇతర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.





