– మోదీ పాలన, కార్యకర్తల కష్టంతోనే కరీంనగర్‌లో మెజారిటీ
– ఇండిపెండెంట్ల కలయికతో మ్యాజిక్ ఫిగర్ దాటాం
– బేజేపీకి మేయర్ పీఠం దక్కొద్దని మూడు పార్టీల కుట్ర
– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మోదీ పాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌పేర్కొన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అద్బుతమైన తీర్పు ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇండిపెండెంట్లు కూడా చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటిందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిస్తే కూడా 26 సీట్లకే పరిమితమయ్యాయి.. అయినా బీజేపీకి మేయర్ పదవి దక్కకూడదని ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కరీంనగర్ వేదికగా ఈ పార్టీల బండారం బయటపడుతోందని, వాటి దిగజారుడు రాజకీయాలను జనం అసహ్యించుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రతిపాదిత అభ్యర్ధికి మద్దతిద్దామని స్థానిక ఎమ్మెల్యే తన పార్టీ కార్పొరేటర్లకు చెబుతున్నట్లు తెలుస్తోందని, తమకే మేయర్ పదవి కావాలని ఎంఐఎం కోరుతోందని చెప్పారు. మీకున్న సంఖ్య ఎంత? మీరు ఎలా మేయర్ అవుతారు అని నిలదీశారు. కరీంనగర్‌లో కలిసి ఉండాలన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నిర్ణయం రాష్ట్ర నాయకత్వాలదా.. స్థానిక నేతల అభిప్రాయమా స్పష్టం చేయాలన్నారు. ఈ కారణంగానే ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ-ఫార్ములా రేస్, కాళేశ్వరం కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయడం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హామీల సంగతి చూస్తా
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందాన్ని గమనించే ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని, ఇండిపెండెంట్లు సైతం బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కుట్రలు చేస్తే బీజేపీ శక్తి ఏందో, కరీంనగర్ ప్రజల దమ్మేందో చూపిస్తాం అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ వేదికగానే కాంగ్రెస్ హామీల సంగతి చూస్తామన్నారు. లక్షలాదిమంది మహిళలు, వృద్దులు, రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్, డీఏలు, ఈపీఎఫ్ పైసలు రాని రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ, ఉద్యోగులందరినీ రోడ్డుపైకి ఎక్కిస్తా.. లక్షలాదిమంది రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను రోడ్లపైకి తెస్తా.. కాంగ్రెస్‌కు సెగ తగిలిస్తా అని బండి హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలారా.. కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ సపోర్టు చేస్తుంది.. దీనికి మీరు సమ్మతమేనా అని అడిగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని, బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నన్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి, బడే భాయ్ ఒవైసీ, చోటా భాయ్ అక్బరుద్దీన్ పాగా వేసినా ఏమీ చేయలేకపోయారన్నారు. బీజేపీ అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి వెళ్లరు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెప్పాలనే కసితో ఉన్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందంటూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏందో చూస్తారన్నారు. భాగ్యనగర్‌ను మూడు ముక్కలు చేసి ఒకటి ఎంఐఎంకు రాసివ్వాలనుకుంటున్నరు.. ఇది సీఎం సొంత ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదు.. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ, ఇతర కేంద్ర నిధుల ద్వారా రూ.1400 కోట్లు వచ్చాయని బండి తెలిపారు. 2028లో తప్పనిసరిగా అధికారంలోకి వచ్చి తీరుతాం అని ఆయన స్పష్టం చేశారు.
జీవం లేని ఎంఐఎం
జీవం లేని పార్టీ ఎంఐఎం.. ఇవాళ పునరుజ్జీవ ఉత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ముస్లిం మహిళలే ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారని, ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలంతా మోదీకి మద్దతిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మహిళలు బహిరంగంగానే బీజేపీకి సపోర్టు చేశారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, లీగల్ సెల్ నాయకులు ఆంటోనీ రెడ్డి, అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు కళ్యాణ్ నాయక్, రవి కిరణ్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





