మెరుపు తీగెలు
దానికి యెద్దూ తెలీదు, పొద్దూ తెలీదు. ఎందుకంటే అది యెద్దు! వీడేమో మనిషి. వీడికి యెద్దూ తెలుసు. పొద్దూ తెలుసు. పొద్దు కింద పంటా తెలుసు. ఈ పంట నాది, ఆ పంట నీది అని తెలుసు. తనది తెలుసు. పరాయిది తెలుసు. వాటి మధ్య భేదమూ తెలుసు. ఎటొచ్చీ యెద్దుకే తెలీదు. తన పర భేదములు లేకపోవడం యెంత పెద్ద ప్రమాదమో ఆ యెద్దుకి యెన్నటికీ బోధ పడలేదు. ఆకలేస్తే కడుపునిండా తినడం తెలుసు. కొడితే కాయడం తెలుసు. ఈ భూమండలం అంతా పచ్చదనమే. అక్కడ యెందుకు తినచ్చో యిక్కడ యెందుకు తినరాదో పెంచినవాడు చెప్పాడు, చెవిటివాని ముందు శంఖం వూదినట్టు. గట్టుమీద మేతకీ గట్టుదిగువ మేతకీ తేడా తెలీలేదు యెద్దుకి. ఎక్కువ తక్కువల జాతి తేడా లేకుండా యెవరి పొలంలోనైనా తినేది.
‘దొంగెద్దు’ అనిపించుకుంది.
వీడు అమ్మనా బూతులు పడలేకపోయాడు. ఊళ్ళో వాళ్ళతో సాగలేకపోయాడు. ఎద్దుని సాకలేకపోయాడు. కొడితే కాశాడు. పెడితే తప్పు కట్టాడు. వల్లకాలేదు. ఆఖరికి యెద్దు మెళ్ళో దుక్క వేళ్ళాడదీశాడు. ముందరి రెండు కాళ్ళకి ముడులు వేశాడు. నోటికి జాలీ కట్టాడు. వారం తిరగలేదు. నిన్నటిదాకా ‘దొంగెద్దు’ అన్నవాళ్ళే ‘పాపం, మూగజీవి…’ అన్నారు. నిన్నటిదాకా ‘వీడిని బందెలదొడ్డిలో కట్టెయ్యాలి,’ అన్నవాళ్ళే ‘వీడికి దాని వుసురు తగులుతుంది,’ అన్నారు. నాశానమైపోతావన్నారు.
ఒక మంచిరోజు చూసి యెద్దు మెళ్ళో దుక్కతీసి బంతిపూల దండ వేశాడు. ముందరి రెండు కాళ్ళకి ముడులు విప్పి పసుపు పూశాడు. నోటికున్న జాలీతీసి ముక్కుమీద నుదురు వరకు కుంకుమబొట్టు దిద్దాడు. కన్నె విప్పి వూరిమీద వదిలాడు. ఎద్దుకి యిప్పుడు యెక్కడైనా తిని తిరిగే స్వేచ్ఛ వచ్చింది. ఆ వూరికి యిప్పుడు కొత్తదేవుడూ వచ్చాడు!
-బమ్మిడి జగదీశ్వరరావు





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల