ఆ అయిదింటిని విలీనం చేయాలి

– రామయ్య భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌నందరిదీ
– రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 :  భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలోని  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రజల ఆకాంక్షలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రాజ్యసభలో ఇటీవల జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణతోనే అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు. ఆ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, రవాణా, ఆదాయ, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సేవల కోసం భద్రాచలంపైనే ఆధారపడుతున్నారని చెప్పారు. భద్రాచల రామయ్య భూములు కూడా ఆంధ్రాలో విలీనమైన పురుషోత్తపట్నంలో వేలాది ఎకరాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో అవి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కొనసాగడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా కొన్ని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినప్పటికీ, ప్రస్తుతం భద్రాచలం సమీపంలోని ఐదు పంచాయతీల విషయంలో పునర్విమర్శ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవన విధానం మొత్తం భద్రాచలంతో ముడిపడి ఉందని, ఈ అంశాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలించాలని కోరారు.

ప్ర‌జాప్ర‌తినిధులు, ఉద్యోగ సంఘాల మ‌ద్ద‌తు

ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు కూడా ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని మద్దతు తెలుపుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసి ఈ డిమాండ్‌ను మరోసారి ముందుకు తీసుకెళ్లింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే అంశంపై కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రాచలం ఐదు పంచాయతీల విలీన అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కగా, స్థానిక ప్రజల్లో కూడా దీనిపై ఆసక్తి నెలకొంది. ప్రజల న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు.
అనంతరం భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం గిరిజన గిరిజనేతరులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ భద్రాచలం నియోజకవర్గం లో ప్రయాణించాలంటే 10 కిలోమీటర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణించాల్సి వస్తుంది.  ఈ ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపితే ప్రజలకు మాత్రమే కాకుండా దేవుడు కష్టాలు కూడా తీరుతాయన్నారు. .రాముడు ఇక్కడున్నాడు రాముడు భూములు పురుషోత్తపట్నం లో ఉన్నాయి.భద్రాచలంలో మనిషి చనిపోతే కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా స్థలము లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో. రాష్ట్ర తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎలూరు శ్రీనివాసరావు, యుటిఎఫ్ చాడా రవి కుమార్, బూర రాజు, ఖమ్మం జిల్లా జేఏసీ చైర్మన్ గుండుపల్లి శ్రీనివాస్, కన్వీనర్ కొనిదెల శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ చైర్మన్ అమర్నేని రామారావు చైతన్య భార్గవ్, వీరబాబు, టి ఎన్జీవోస్ డివిజన్ అధ్యక్షులు డెక్క నరసింహారావు సెక్రటరీ గగ్గూరి బాలకృష్ణ  శ్రీనివాస్ గాంధీ అపర్ణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లగుల్ల నాగేశ్వరరావు భూషణ్ రావు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *