మిత్రుడి కోసం కొన్ని వాక్యాలెప్పుడూ
యెదురుచూస్తూ వుంటాయి
సముద్ర తీరంలో అలల అరల్లో నింపుకున్న
కొన్ని జ్ఞాపకాలు
రాత్రి చెప్పుకున్న వింతైన మాటలూ
యీ ప్రపంచానికి నువ్వు చెప్పాలనుకున్న
నీ అస్థిత్వము
అన్నీ అద్భుతాలే నాకు
యీ విశ్వం గురించి నీ ఆలోచనలు స్థానభ్రంశం చెంది
నాదాకా చేరిన క్షణాలు నాకింకా గుర్తే
పాలపుంతలూ చంద్రుడి మరణం
మళ్ళా ఆవిర్భవించడం
యివన్నీ గొప్ప అనుభూతులే
నీ జీవితంలో కూడా కృష్ణబిలం వుందని
నేను గమనించనే లేదు
నీ కక్ష్యలో నేనూ
బిలం కక్ష్యలో నువ్వూ తిరుగుతూ తిరుగుతూ
వో వైపుగా వాలుతున్నామనుకున్నాం
కొన్ని వేల కాంతి సంవత్సరాలు
నీకోసం వేచి చూస్తున్నాయని నాకప్పుడు తెలియదు
నువ్వెళ్ళాక కక్ష్య అదుపు తప్పి కూరుకుంది
వో శ్రీధరుడా
-తిలక్ బొమ్మరాజు




