పునర్జన్మ ఇచ్చేది వైద్యులు మాత్రమే

-త‌ల్లిదండ్రుల త‌ర్వాత న‌మ‌స్క‌రించేది డాక్ట‌ర్ల‌కే
– డాక్ట‌ర్లు నిత్య‌విద్యార్థులు
– అత్య‌ధిక మెడిక‌ల్ క‌ళాశాలలున్న రాష్ట్రం తెలంగాణ‌
– మెడిక‌ల్ టూర్‌కు వ‌స్తున్న విదేశీ రోగులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28: డాక్టర్లకు సమాజంలో ఉండే గౌరవం ఇంక వేరే ఏ వృత్తిలో లేద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శుక్ర‌వారం టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన టైమ్స్ హెల్త్ ఎక్స్ లెన్స్ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయ‌న మాట్లాడుతూ  దేవునికి, తల్లిదండ్రులకు తర్వాత డాక్టర్ ఎవరైనా రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు. ఈ గౌరవం కేవలం డాక్టర్లకి మాత్రమే దక్కుతుంద‌న్నారు.  వైద్యో నారాయణ హరి అంటారు.. తల్లి జన్మనిస్తే పునర్జన్మని ఇచ్చేది డాక్టర్లన్నారు. డాక్టర్ కావాలంటే ఎంతో కష్టపడాలి ఎన్నో త్యాగాలు చేయాలి. ఇది ఛాలెంజింగ్ ప్రొపెష‌న్‌.  డాక్ట‌ర్లు నిత్య విద్యార్థులే. పంచవ్యాప్తం గా మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాదులో మెడికల్ టూరిజం పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారన్నారు. తెలంగాణలో లక్ష మంది జనాభాకు 22 మంది డాక్టర్లు వున్నారు. అత్యధిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లున్న రాష్ట్రం కూడా తెలంగాణనే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వైద్యరంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి అవార్డు కార్యక్రమంలో గవర్నమెంట్ డాక్టర్లను కూడా సత్కరిస్తే బాగుంటుంద‌న్నారు.  నేను ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ డాక్టర్లతో సమానంగా గవర్నమెంట్ డాక్టర్ ఎందుకు చేయకూడదు అని ప్రభుత్వాసుపత్రిల్లో మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీలు చేపించామ‌న్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేట్ తో సమానంగా మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీలు జరిగాయ‌ని గుర్తుచేశారు.  35% నుంచి 78% కి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెంచాం.  మెడికల్ టూరిజంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రజలకు మంచి వైద్యం కూడా అందుతుంద‌న్నారు. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లే వాళ్ళం. ఇప్పుడు అమెరికన్స్ హైదరాబాద్ కు వైద్యం కోసం వస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పాలసీలు మారాల్సిన అవసరం లేదు. 99.9 శాతం మంది డాక్టర్లు మంచివారే. ఎక్కడో ఒక శాతం వారు చేసే పనుల వల్ల చెడ్డ పేరు వస్తున్న‌ద‌న్నారు.  ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెడ్డవాడు కాదు. మంచి రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అలాగే డాక్టర్లలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంద‌న్నారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ను కాపాల్సిన బాధ్యత మీపై ఉంద‌న్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *