– ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే అభివృద్ధి
– ఆలయ ఆవరణలో సమీక్షలో మంత్రి సీతక్క\
– మేడారం విశిష్టతను దెబ్బతీయొద్దు
– పూజారుల హెచ్చరిక
ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: వెయ్యేండ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యండ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఆమేరకు మేడారం దేవాలయ కీర్తిని, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క వెల్లడిరచారు. సమ్మక్క సారలమ్మ పూజారులతో గుడి అభివృద్ధిపై సోమవారం మేడారం ఆలయ ప్రాంగణంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అభివృద్ధి పనులు పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే జరుగుతాయని, డిజైన్ రూపకల్పన కూడా పూజారులు, స్థానికుల అభిప్రాయం మేరకే రూపొందిస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్లపాటు సమ్మక్క సారలమ్మ తల్లులకు సేవ చేశానని, ఈసారి మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులకు మంత్రిగా సేవ చేసే అదృష్టం దక్కిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తల్లులపై ఎంతో నమ్మకం ఉందని, వారి తల్లుల దీవెనలతో ఇక్కడినుంచి పాదయాత్ర చేసి తాను అధికారంలోకి వచ్చినట్టు సీఎం ఎన్నోసార్లు చెప్పారని తెలిపారు. భక్తులకు మరింత సులభంగా తల్లుల దర్శన భాగ్యం కల్పించేందుకు పూజారుల సూచన మేరకు గుడి విస్తీర్ణాన్ని పెంచుతున్నామన్నారు. యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టి మహా జాతర లోపు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఆదివాసీ జాతి బిడ్డగా తాను, సమ్మక్కIసారలమ్మ తల్లుల భక్తుడిగా సీఎం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేకంగా దృష్టి సారించి మేడారం గుడిని అభివృద్ధి చేస్తున్నామని, మేడారంలో భక్తులకు తల్లుల దర్శనంతోపాటు వారి త్యాగాల చరిత్రను తెలియచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు. ముఖ్యమంత్రి త్వరలో మేడారంలో పర్యటించి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తే తల్లుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం
మేడారం ఆలయ ప్రతిష్ట మరో వెయ్యేళ్లు కొనసాగాలంటూ అభివృద్ది పనులను చేపడుతున్న ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పూజారులు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేయొద్దని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు హెచ్చరించారు. తమ ఆచారాలు, సంస్కృతి తెలియని వారే మేడారం పవిత్ర స్థలానికి అపవాదు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మహా జాతర ఒకప్పుడు దట్టమైన అడవిలో జరిగేదని, ఇపుడు భక్తుల సౌకర్యార్దం ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని చెప్పారు. వచ్చే మహా జాతరను దృష్టిలో ఉంచుకుని మరింత అభివృద్ది చేపట్టేలా ముందుకొచ్చిన సీఎం, మంత్రి సీతక్కలకు ధన్యవాదాలు తెలిపారు. కోటిమందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు వస్తుంటారని, అందుకు తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం ఆలయ ప్రతిష్ట మరో వేయేళ్లపాటు కొనసాగేలా అభివృద్ది పనులు ఉండనున్నాయని పేర్కొన్నారు. భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేలా నిర్మాణాలు ఉండనున్నాఅశ్రీతీ, ఆలయ అవరణ ఇరుకుగా ఉన్నందున జాతర సమయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకేక ఆలయ ఆవరణను విస్తరించాలని, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను కూడా తల్లుల గద్దెల వరస క్రమంలో చేర్చాలని కోరామని జగ్గారావు చెప్పారు. మేడారంలో ఏదో అపచారం జరుగుతున్నదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం తల్లుల ఆశీస్సులతో ఇక్కడ జీవిస్తున్నాం.. మేడారం ఆలయం మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాం.. కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం అభివృద్ది పనులు చేపట్టడం సంతోషం.. మూడు నెలల్లో మహా జాతర వస్తుంది.. అప్పటిలోపు పనులు పూర్తి చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



