మేడారం ..అన్య వర్గాల ఆధిపత్యం 

అదొక ఆధ్యాత్మిక భావన.. ఆ భావోద్వేగానికి వర్ణించడానికి మాటలు చాలవు ఒక ఊహాజణితమైనటువంటి శక్తి స్వరూపిణులుగా సమ్మక్క సారలమ్మలను కొలిచే భక్తులు ఇప్పుడు మేడారంలో కనిపిస్తున్న ప్రాకారాలు పూజా విధానం తంతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. జాతరపై వైదీకీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే  కాదు ..గిరిజన పూజారులైన కోయ దొరల ప్రాధాన్యతను తగ్గిపోయింది. ఇతర వర్గాల ఆధిపత్యం పెరగడం వల్ల గిరిజన సంస్కృతి తన ప్రత్యేకతను కోల్పోతోంది. కాకతీయ రాజులపై సమ్మక్క కుటుంబం గెరిల్లా పోరాటం చేసి వీర మరణం పొందాయని చరిత్ర చెప్తోంది. ఈ పోరాట చరిత్రను మరుగున పడేసి, కేవలం మొక్కులు-ముడుపులు చెల్లించుకునే కార్యక్రమంగా జాతరను మార్చేశారు. కొందరయితే…మందు, విందు కార్యక్రమంలా చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ గిరిజన అస్తిత్వానికి నిలువుటద్దం మేడారం. అడవి బిడ్డల హక్కుల కోసం, పరాయి పాలనపై ఎదిరించిన వీరవనితల నెత్తురు చిందిన నేల మేడారం. పాత వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అంగరంగ వైభవంగా ఈ నెల 28 నుండి 31 వ తేదీ వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్నది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం మేడారం. మరి ఇప్పుడో… కాంక్రీట్ జంగిల్ గా మార్పు చెందుతున్నది. దారుణం ఏమిటంటే.. ప్రభుత్వమే అభివృద్ధి పేరిట, భక్తులకు సౌకర్యాలు కల్పించే పేరిట పక్కా భవనాలను కట్టించారు. రెండు దశాబ్దాల కిందటి మేడారం ఊరుకు ఇప్పటి మేడారం ఊరుకు పోలికే లేదు. గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర క్రమేపి ఇతర దేవుళ్ళ జాతరల మాదిరిగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భక్తుల ఇలవేల్పు అయిన సమ్మక్క, సారాలక్కలకు చెరో గద్దె, పసుపు, కుంకులతో అలంకరించిన చెక్క మాత్రమే కనిపించేది. ఇప్పుడో…. గద్దెల చుట్టూ వర్తులాకారంలో ఉండే తోరణాలు నిర్మించారు. అమ్మవార్ల ప్రాంగణం లో భక్తుల రద్దీని తట్టుకునేందుకు 15 – 20 మీటర్ల దూరంలో ఇనుప చువ్వలతో ఏర్పాటు ఉండేది. వాటిని తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకమైన రాయితో ప్రహరీ లాగా గోడ కట్టేశారు. మధ్య మధ్యలో ఇనుప గేట్లు ఉన్నాయి. విఐపి ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చుట్టూత బిల్డింగులు కట్టేశారు అవి విఐపిలు, జిల్లా అధికార యంత్రాంగం కోసమే.

సమ్మక్క జాతర తన మూల స్వరూపాన్ని కోల్పోతోంది. అస్తిత్వ పోరాట చిహ్నాన్ని ఒక కార్పొరేట్ ఆధ్యాత్మిక సంతగా మార్పు చెందినట్లు కనిపిస్తోంది. మేడారం జాతరలో మహిమాన్వితులయిన సమ్మక్క సారక్కలకు విగ్రహాలు ఉండవు. గిరిజన పూజారులు (వడ్డే) లు తమ సంప్రదాయ పూజా విధానంతో ప్రతిష్టించే కార్యక్రమంలో భాగంగా గద్దెలపై అమ్మవారు కొలువు తీరుతారు. చిలుకల గుట్ట నుంచి సమ్మక్క పూజారులు కుంకుమ భరణి రూపంలో వెదురు బుట్టలో ఎర్రని వస్త్రంలో చుట్టుకుని తీసుకువచ్చి సమ్మక్క గద్ద పై ప్రతిష్టించడంతో అంత ముందే వచ్చిన కూతురు సారాలమ్మ ఆరోజు వచ్చిన సమ్మక్క లను దర్శించుకునేందుకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తుతారు అదొక ఆధ్యాత్మిక భావన…. ఆ భావోద్వేగానికి వర్ణించడానికి మాటలు చాలవు ఒక ఊహాజణితమైనటువంటి శక్తి స్వరూపిణులుగా సమ్మక్క సారలమ్మలను కొలిచే భక్తులు ఇప్పుడు మేడారంలో కనిపిస్తున్న ప్రాకారాలు పూజా విధానం తంతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. జాతరపై వైదీకీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే  కాదు ..గిరిజన పూజారులైన కోయ దొరల ప్రాధాన్యతను తగ్గిపోయింది. ఇతర వర్గాల ఆధిపత్యం పెరగడం వల్ల గిరిజన సంస్కృతి తన ప్రత్యేకతను కోల్పోతోంది. కాకతీయ రాజులపై సమ్మక్క కుటుంబం గెరిల్లా పోరాటం చేసి వీర మరణం పొందాయని చరిత్ర చెప్తోంది. ఈ పోరాట చరిత్రను మరుగున పడేసి, కేవలం మొక్కులు-ముడుపులు చెల్లించుకునే కార్యక్రమంగా జాతరను మార్చేశారు. కొందరయితే…మందు, విందు కార్యక్రమం లా చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఒకప్పుడు స్వచ్ఛమైన భక్తితో, గిరిజన ఆచారాలతో సాగే ఈ జాతర నేడు కార్పొరేట్ శక్తులు తమ వ్యాపారానికి వాడుకుంటున్నాయి. జాతరలో ధనికుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రాంగణమంతా టెలికాం, శీతల పానీయాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల ఫ్లెక్సీలతో నిండిపోతోంది. భక్తుల రద్దీని క్యాష్ చేసుకుంటున్న కార్పొరేట్ శక్తులు, అక్కడ ఆధ్యాత్మికత ముసుగులో వ్యాపారం చేస్తున్నాయి. పార్కింగ్ నుంచి మొదలుకొని, ప్రసాదాల తయారీ, పారిశుధ్యం వరకు ప్రతిదీ కాంట్రాక్టుల పరమవడటంతో జాతర ఒక భారీ బిజినెస్ మోడల్‌గా రూపాంతరం చెందింది. ఇక విఐపి దర్శనాల కల్చర్ ఇతర దేవాలయాల్లో మాదిరిగానే కనిపిస్తోంది. గతంలో వీఐపీ ల కోసం సామాన్య భక్తుల క్యూలైన్లు ఆపేసేవారు. తొక్కిసలాట జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఇప్పటికీ ఆ బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం ఆగలేదు. సమ్మక్క-సారలమ్మలు పోరాటం చేసిందే సామాన్యుల కోసం. కానీ నేడు మేడారంలో ప్రోటోకాల్ పేరిట సామాన్యుడిని అవమానించడం సబబేనా…ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది. అధికారం, ధనం ఉన్న వారికి ప్రత్యేక మార్గాలు, ఏసీ గదులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ జాతరలోని సామాజిక సమానత్వాన్నీ వనదేవతల సాక్షిగా అడవుల్లో కలిపేశారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. పర్యావరణ కలుషితం మరో ఎత్తు. అడవిని కేంద్రంగా చేసుకొని చెట్టుపుట్టా, చెలక చేనులతో గిరిజనులు జీవనం సాగిస్తుంటారు. జాతర పేరిట మేడారం గ్రామం చుట్టూ పది కిలోమీటర్ల మేర అడవి లేకుండా చేసేశారు. అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న చెట్లు తప్ప పెద్ద వృక్షాలు ఏమీ లేవు. భక్తులు తమ వెంట తెచ్చుకున్న మేకలు, గొర్రెలు కోళ్లు అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత అక్కడే వంట చేసుకుని తిని సొంతుల్లకు ప్రయాణం అవుతుండడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. అయితే జాతర పురస్కరించుకొని నెలరోజుల నుంచే మేడారం పరిసరాల్లో ఎక్కడ చూసినా మేకలు,గొర్రెలు, కోళ్ల బొక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన పారిశుద్ధ్య కార్మికులు ఎంతగా వాటిని ఏరేస్తూన్నప్పటికీ అవి అక్కడ మట్టిలో కలిసిపోతున్నాయి.

మేడారం కు భక్తులు తీసుకొస్తున్న ప్లాస్టిక్ బాటిల్లు కవర్లు, వస్త్రాలు, గాజులు, మద్యం బాటిళ్లు.. ఇతర సామగ్రితో మేడారం ఒక కాలుష్య గుడారంగా కనిపిస్తోంది. జంపన్న వాగు కూడా మానవ వ్యర్థాలు, స్నానాలు చేసి వదిలేసిన దుస్తులు, పగిలిన గాజులు, ప్లాస్టిక్ కవర్లు, చాకొలేట్ ర్యాపర్ల్ ఇలా రకరకాల వ్యర్థాలు కాలుష్య కాసారం గా తయారయింది. మేడారం గద్దెల చుట్టూతా సిమెంట్ రోడ్లు వేసినప్పటికీ భక్తులు సంఖ్య కోట్లల్లో ఉండడంతో అక్కడ దుమ్ము ..ధూళితో గాలి కాలుష్యం అవుతోంది. శ్వాస సంబంధిత అనారోగ్యం ఉన్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భక్తులు పీల్చే గాలి, తిరిగే నేల కలుషితం అవుతుంది. మనుషుల వల్ల ఏర్పడుతున్న ఈ పర్యావరణ హాని అక్కడ అడవుల్లో ఉండే వన్యప్రాణులకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అలాగే మేడారం గ్రామస్తులతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో కూడా ఈ పొల్యూషన్ సంబంధించిన సమస్యలు జాతర ముగిసిన నెల రోజుల వరకూ పీడిస్తుంటాయి. ప్రభుత్వం పర్యావరణ హిత జాతరగా భక్తులు జరుపుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. భక్తులు కూడా పర్యావరణం కలుషితం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలి. గిరిజన దేవతలు సమ్మక్క సారలమ్మ జాతరను గిరిజన సంప్రదాయం, ఆచారం ప్రకారం జరిగేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాల్సిన బాధ్యత మనందరిదీ. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ.. క్షేమంగా ఇళ్లకు చేరేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేయాలి. వారికి మనమూ సహకరిద్దాం.

వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *