నిష్ఠతో, చిత్తశుద్ధితో మేడారం పనులు చేయిస్తున్నాం

– పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క
– భక్తుల నమ్మకంతో ఆటలాడొద్దు
– ప్రతిపక్షాలు, రాజకీయ పత్రికలకు హితవు
– పనులు పరిశీలించిన మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా, అడ్లూరి

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అంటే మాకు(సీఎం, మంత్రులకు) ఉండేది బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం.. అందుకే నిష్ఠతో, చిత్తశుద్ధితో మేడారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడారంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ అడ్ల్లూరి లక్ష్మణ్‌లు బుధవారం పర్యటించి సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహా మేడారం జాతర లోపు అన్ని పనులు పూర్తి చేస్తామని, చిత్తశుద్ధి, బాధ్యతతో అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. సమ్మక్క-సారలమ్మల విశ్వాసం, ఆదివాసుల అస్తిత్వం, ఆత్మగౌరవం, భక్తులు కోరికలు కొంగుబంగారంలా తీర్చే తల్లుల ఘన కీర్తిని పది తరాలు నిలిచిపోయేలా పనిచేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నామని, మిషన్‌ లాగా 90 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తున్నామని ఆమె చెప్పారు. నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేస్తామని, సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్‌ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుని మీద రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్‌ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదు.. పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదంటూ ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. అధికారం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరొక వారంలొ పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుంది అంటూ దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలొద్దు.. రాజకీయాలొద్దు అని అన్నారు. ప్రకృతి దేవతలు సమ్మక్క సారలమ్మలను కోట్లమంది భక్తులు సందర్శించుకుంటున్నారంటే అది వారి విశ్వాసం.. ఆ విశ్వాసాలను పటిష్టం చేసే విధంగానే పనులు కొనసాగుతున్నాయని, ఆదివాసుల అస్తిత్వం, భక్తుల నమ్మకం, వనదేవతల త్యాగం చరిత్రలో నిలిచేలా సీఎం ఆదేశాలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *