– 2026 ఆసియన్ గేమ్స్, 2028 ఒలింపిక్స్ లక్ష్యం
– మంత్రి పొన్నం, కార్యదర్శి శ్రీధర్, ఎంజేపీ కార్యదర్శి సైదులు అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: జాతీయస్థాయిలో జరిగిన టి స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. యాచ్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఓపెన్ రెగట్టా ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగంలో చాంద్రాయణ గుట్ట గర్ల్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న జె.శిరీష వెండి పతకం సాధించగా, మునుగోడు బాయ్స్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న వి.హనుమంతు కాంస్య పతకం సాధించాడు. కల్వకుర్తి గర్ల్స్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న ఎం.అక్షర జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. పతకాలు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, సంయుక్త కార్యదర్శి తిరుపతి అభినందించారు. బీసీ గురుకుల విద్యార్థులకు చదువుతోపాటు వారిలో నైపుణ్యాలను, ఆసక్తిని గమనించి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బీసీ గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగా బీసీ గురుకుల విద్యార్థులకు యాచ్ క్లబ్ ఆద్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో శిక్షణ ఇస్తున్నామని సైదులు తెలిపారు. అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతోపాటు వారు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చామన్నారు. జూలై 1 నుంచి 20వ తేదీ వరకు మూడో విడత శిక్షణ ఇచ్చామని, వారిలో జాతీయ స్థాయిలో ముగ్గురు విద్యార్థులు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను 2026 లో జరిగే ఆసియన్ గేమ్స్, 2028 జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని, అందుకవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు.





