– ఖండించిన అమెజాన్ సంస్థ
న్యూదిల్లీ, ఏప్రిల్ 8: ముచ్చటగా మూడోసారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదంటూ ఆన్ ఫోరమ్స్, టెక్ పోర్టల్స్ వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో భారీగా ఉద్యోగులను కొలువుల నుంచి ఈ సంస్థ తొలగించింది. తాజాగా ఈ ఏడాది మే లో మళ్లీ భారీగా ఉద్యోగులను తొలగిస్తుందంటూ ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని అమెజాన్ ఖండించింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించింది. చైనాకు చెందిన టెక్ పోర్టల్ లీ ఫెంగ్ నెట్‌వర్క్ సైతం ఈ వార్తను ప్రచురించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, మానవ వనరుల విభాగంలోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండవచ్చని చైనా టెక్ పోర్టల్ వివరించింది. అలాగే ఎల్5 నుంచి ఎల్7 ఉద్యోగ స్థాయిల్లోని మేనేజర్లు, వైట్ కాలర్ ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ గిడ్డంగి, లాజిస్టిక్స్ సిబ్బందిపై ఈ ప్రభావం ఉండదని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ కార్పొరేట్ కంపెనీ ఇప్పటికే 2025 అక్టోబర్‌లో 14 వేల మంది, 2026 జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం సీఈవో ఆండీ జస్సీ నేతృత్వంతో ఈ ఉద్యోగుల తొలగింపు పక్రియను చేపట్టింది. మరోవైపు ఐఏ, మౌలిక సదుపాయాలలో అమెజాన్ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతుంది. ఈ పెట్టుబడులను పెంచుకొంటూ పోతున్నది. ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఉద్యోగుల పాత్ర మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చుననే అభిప్రాయాన్ని అమెజాన్ సంస్థ తాజాగా వ్యక్తం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు 57 వేల మందికిపైగా ఉద్యోగులను అమెజాన్ తొలగించిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





