ఆద‌ర్శ‌ప్రాయంగా మర్రిపల్లిగూడెం పాఠశాల

– కిచెన్‌ గార్డెన్‌లో పూల మొక్కలు, కాయగూరల సాగు
– ప్రకృతి సోయగంతోపాటు ఆదాయం
– ఉపాధ్యాయుల కృషితో విద్యార్ధులకు పౌష్టికాహారం

కమలాపూర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఒకవైపు చుక్కలనంటుతున్న కాయగూరలు, ఆకు కూరల ధరలు.. మరోవైపు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం అరకొరగా అందిస్తున్న నిధులు వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం నామమాత్రమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీ స్థలాల్లో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను కమలాపూర్‌ మండలంలోని మర్రిపల్లిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆచరణలో పెట్టి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్ధులు 80మందికి వారానికి రెండు రోజులు పౌష్టికాహారం అందిస్తున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విశాలమైన ఆట స్థలం కలిగి ఉంది. మొదట ఐదు గుంటల స్థలంతో ప్రారంభించి ప్రస్తుతం ఎకరం స్థలంలో వివిధ ఆకు కూరలు, కాయగూరలు, పూలు సాగు చేస్తున్నారు.

ఉపాధి హామీ పథకం దన్ను

జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏదైనా సంస్థలో వేయి మొక్కలు పెంచితే ఒక కాపలాదారును నియమించుకునే వెసులుబాటు వుండడంతో ఈ పథకాన్ని వర్తింపజేసి పాఠశాల కిచెన్‌ గార్డెన్‌లో ఆకుకూరలు, బెండ, వంకాయ, అలచంద, చిక్కుడు వంటి కాయగూరలు సాగు చేస్తున్నారు. బంతి, మందార, గులాబి, మల్లె, పారిజాతం, సంపెంగ వంటి పూల మొక్కలు పెంచుతున్నారు. పాఠశాల విద్యార్ధులకు సులువుగా గణితం బోధించడానికి త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం ఆకారాల్లో మడులు తయారు చేసి అందులో ఆకు కూరలు సాగు చేస్తూ త్రిభుజం, చతురస్రంపై అవగాహన కల్పిస్తున్నారు. బంతి, మందార పూలలోని అన్ని రకాల మొక్కలను పెంచుతుండడంతో అవి ఏపుగా పెరిగి స్కూల్‌ గ్రౌండ్‌ పార్కు అనుభూతిని కలిగిస్తోంది. పూల మొక్కల నారు కోసం ఉపాధ్యాయులు రూ.1500 ఖర్చు చేయగా ప్రతి వారం బంతి పూలు విక్రయించడం ద్వారా ఇప్పటివరకు రూ.2 వేల ఆదాయం లభించిందని ఉద్యానవనం ఇన్‌చార్జి, ఆంగ్ల ఉపాద్యాయుడు ఎన్‌.శ్రీనివాస్‌ తెలిపారు. వచ్చే జూన్‌ నుండి ఔషధ మొక్కలను పెంచాలని నిర్ణయించినట్లు ప్రదానోపాధ్యాయుడు కె.రాజేశ్వర్‌ చెప్పారు. మైదానం లోతట్టు ప్రాంతంలో వుందని, మొరం పోయిస్తే కిచెన్‌ గార్డెన్‌ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు ఔషధ మొక్కలు పెంచుతామని తెలిపారు.

గ్రామ పంచాయతీ ప్రోత్సాహం

ఉన్నత పాటశాలలో కిచెన్‌ గార్డెన్‌ కోసం గ్రామ పంచాయతీ తన వంతు పాత్రగా కొన్ని సిమెంట్‌ స్తంభాలు సమకూర్చడం , నర్సరీ నుంచి పూల మొక్కలు పంపిణి చేసినట్లు పంచాయతీ కార్యదర్శి మారపాక శరత్‌ తెలిపారు.

అధికారుల అభినందనలు

ఉన్నత పాశాలలోని కిచెన్‌ గార్డెన్‌, పూల సాగును ఎంపీడీవో గుండె బాబు, ఎంపీివో చేతన్‌ రెడ్డిలు సందర్శించి ఉపాధ్యాయుల కృషిని, సంకల్పాన్ని అభినందించారు. మండలంలోని ఇతర పాఠశాలల్లో కూడా కిచెన్‌ గార్డెన్‌లను అభివృద్ధి చేసి పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *