– సిఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన మల్లోజుల
– అదే బాటలో తక్కళ్లపల్లి వాసుదేవరావు
– నేడు ఛత్తీస్‌గడ్ సిఎం ముందు లొంగిపోతారని ప్రచారం
– సుక్మా జిల్లా ఎస్పీ ఎదుట 27 మంది లొంగుబాటు
నాగపూర్/హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15: ఏరివేత తప్పదు..లొంగిపోతే బతికిపోతారని కేంద్ర హోంమంత్రి హెచ్చిరికల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా లొంపోతున్నారు. లొంగిపోయిన వారు బతికిపోతే..లొంగని వారు తూటలకు బలవుతున్నారు. వొచ్చే మార్చిలోగా మావోలను అంతం చేస్తామని, ఆపరేషన్ కగార్ చేపట్టి వందలాది మందిని మట్టుపెట్టారు. ఈ క్రమంలో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్ అధికారికంగా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయన ఆయుధాలు అప్పగించారు. మల్లోజుల, ఆయన బృందాన్ని సీఎం ఫడణవీస్ జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. ఇదిలావుంటే మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మల్లోజుల బాటలో కీలక నేతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. గురువారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు ఆశన్న లొంగిపోనున్నారని సమాచారం. ఆయనతోపాటు మరో 70 మంది మావోయిస్టులు కూడా సీఎం ముందు జనజీవన స్రవంతిలో కలవనున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 27 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయినట్లు పోలీసుల ప్రకటించారు. వీరిలో పది మంది మహిళలు ఉన్నారు. వీరిపై రూ.50లక్షల రివార్డు ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ సూచించారు. ఈ రెండు షాకులతో మావోస్టులు అల్లాడుతుంటే తాజాగా ఆశన్న లొంగిపోతున్నారనే వార్త వారికి మరో దెబ్బ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీవ్ర ఒడిదొడుకులతో సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామంగా గమనించాలి. ఇదిలావుంటే ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల నిరంతర ఆపరేషన్‌తో మావోయిస్టులు పెద్దఎత్తున లొంగిపోతున్నారు. మావోయిస్టు కంచుకోట బస్తర్‌లో సైతం గడ్చిరోలి తరహలో మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ఉత్తర బస్తర్ డివిజన్ ఇన్‌ఛార్జి రాజ్‌మాన్ సహా పలువురు లొంగిపోనున్నట్లు సమాచారం. బస్తర్ ఐజీ సుందర్ రాజ్, కాంకేర్ ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ఈ మేరకు మావోయిస్టులతో చర్చలు జరుపుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





