చెన్నై : ఓ పోర్టబుల్ జెనరేటర్ ముగ్గురి ప్రాణాలు తీసిన ఉదంతమిది. ఆ ముగ్గురూ తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్ తన ఇద్దరు కొడుకులు సుమన్ రాజ్ (15), గోకుల్ రాజ్(13)లతో కలిసి మంగళవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోయాడు. వర్షం కారణంగా కరెంట్ పోవటంతో పోర్టబుల్ జెనరేటర్ ఆన్ చేసి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఇంటికి వచ్చి పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరుగింటి సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారి నోటి నుంచి నురగలు వసుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ స్టేన్‌లే మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే జెనరేటర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ ముగ్గురి ప్రాణాలు తీసిందని డాక్టర్లు తేల్చారు. జెనరేటర్ కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో స్థానికంగా కలకలం చెలరేగింది.
ముగ్గురిని కబళించిన జెనరేటర్ పొగ


