భవానీపూర్‌ ‌లో మమత నామినేషన్‌

-‌ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ ‌దాఖలు
– నా జీవితం ఇక్కడే ప్రారంభం అయ్యిందని వెల్లడి

కోల్‌కతా, ఏప్రిల్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్‌ ‌నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. తన జీవితం ఇక్కడినుంచే మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. నామినేషన్‌ ‌వేయడానికి ముందు ఖాలీఘాట్‌లోని నివాసం నుంచి అలీపుర్‌ ‌సర్వే భవనం వరకు ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆమె ఇక్కడ నామినేషన్‌ ‌పత్రాలను సమర్పించారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ’నేను పుట్టింది, పెరిగింది భవానీపుర్‌లోనే. నా జీవితంలో అంతా ఇక్కడినుంచే మొదలైంది’ అని వ్యాఖ్యానించారు. మొత్తం 294 స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలను కోరారు. వోటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌)‌లో భాగంగా.. పలువురి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడంపై మమత ఆందోళన వ్యక్తంచేశారు. వోటర్ల జాబితా నుంచి అనేకమంది పేర్లను తొలగించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఓటరు తుది జాబితా ఇంకా ఎందుకు విడుదల చేయలేదో నాకు అర్థంకావడం లేదు. దీనికి వ్యతిరేకంగా మేం మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’ అని అన్నారు. భవానీపుర్‌ ‌నుంచి మమత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీదీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా సువేందు అధికారిని బరిలోకి దింపింది. ఇక, బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23, 29‌న రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4న వోట్ల లెక్కింపు ఉండనుంది.

ఎన్నికల సంఘంతో టిఎంసి సమావేశం రసాభాస
 
బెంగాల్‌లో బుధవారం తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌బృందం-ఎన్నికల సంఘం మధ్య జరిగిన సమావేశంలో రసాభాస నెలకొంది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశం అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. సమావేశం అనంతరం టీఎంసీ రాజ్యసభ స‌భ్యుడు డెరెక్‌ ‌మీ డియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన లేఖను తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌కు అందజేశామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల అధికారులకు భాజపాతో సంబంధాలున్న నిర్దిష్ట ఉదంతాలను ఆయన ముందు లేవనెత్తామన్నారు. దీంతో ఎన్నికల సంఘం అధిపతి ఆగ్రహంతో తమను సమావేశం నుంచి బయటకు వెళ్లిపొమ్మన్నారని ఆరోపించారు. మరోవైపు సమావేశంలో ఓ టీఎంసీ  ఎంపీ అరుస్తూ గందరగోళం సృష్టించారని ఈసీ ఆరోపించింది. సీఈసీ జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతున్న సమయంలో టీఎంసీ ఎంపీ ఇతర ఎన్నికల కమిషనర్లపై కేకలు వేస్తూ ఆయనను మాట్లాడకుండా అడ్డుకున్నారని తెలిపింది. బెంగాల్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, బెదిరింపులు, ప్రలోభాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సమావేశం అనంతరం టీఎంసీ పార్టీకి ఎన్నికల సంఘం అల్టిమేటం జారీ చేసింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సూచించింది. వోటింగ్‌ ‌సమయంలో బూత్‌ ‌క్యాప్చరింగ్‌, ‌బూత్‌ ‌జామింగ్‌ ‌వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *