– లొంగిపోయిన మల్లోజుల మలిదశ ప్రస్థానం షురూ
– మావోయిస్టులకు భారీ నష్టం
– సరైన సమయంలో సముచిత నిర్ణయం
జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను, అభయ్), మరో 60 మంది వివిధ కేడర్లలోని మావోయిస్టులు మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వేణుగోపాల్ రావు చిన్న వయస్సులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. మావోయిస్టు పార్టీ విలీనం తర్వాత, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. మల్లోజుల ఒకప్పుడు రాజ్యాధికారం తుపాకి గొట్టం ద్వారానే సిద్ధిస్తుంది అనే నినాదంతో అడవుల్ని ఆశ్రయించి అట్టడుగు వర్గాల కోసం పోరాడారు. అతని నాలుగు దశాబ్దాల ప్రయాణంలో బుల్లెట్లు కాదు బ్యాలెట్ మాత్రమే దేశాన్ని మార్చగలవని కాలం చూపించింది. మావోయిస్టు సిద్ధాంతం ఒకప్పుడు ఆకలి తీర్చే విప్లవమని నమ్మిన మల్లోజుల ఈరోజు అదే సిద్ధాంతం కాలం చెల్లినదని అంగీకరిస్తున్నారు. మల్లోజుల కుటుంబ మూలాల్లో స్వాతంత్య్ర సమరయోధుల రక్తం ఉంది. వారి పోరాటం బ్రిటిష్ శాసనం మీదైతే మల్లోజుల పోరాటం భారత వ్యవస్థ మీద. కానీ చివరకు స్వాతంత్య్రం ఆయుధాలతో రాదు.. అవగాహనతో వస్తుందని నమ్మి మల్లోజుల లొంగిపోయారు. ఇది ఓటమి కాదు. ఇది ఆలోచన విజయం. భవిష్యత్తులో మల్లోజుల మలుపు ఇంకా ఎందరో మావోయిస్టుల పరివర్తనకు దారితీస్తుందని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. దేశం ఆయుధాన్ని క్షమించకపోచ్చు కానీ ఆలోచన మారిన నాయకుడిని తప్పకుండా అంగీకరిస్తుంది. ‘ఎర్రబావుటా వీరుడు ఇప్పుడు ప్రజాబావుటా సేవకుడు. దేశం కోసం జీవించడమే నిజమైన పోరాటమని గ్రహించిన విప్లవయోధుని నిజగాథ ఇది.
మల్లోజుల నేపథ్యం..
మల్లోజుల వెంకటయ్య-మధురమ్మ దంపతుల ముగ్గురు కుమారులలో వేణుగోపాల్ చిన్నవాడు. ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన బీకాం పూర్తిచేశారు. పెద్దపల్లి సాయుధ రైతాంగ పోరాటంతో అన్న మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీతో కలిసి తుపాకీ పట్టారు. నాలుగు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన అన్నదమ్ములు అడవుల్లో పోరు సాగించారు. 2011 నవంబర్ 24న కిషన్‌జీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించగా వేణుగోపాల్ రావు ఉద్యమ పంథాలోనే కొనసాగారు. నాలుగు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం మావోయిస్టు పార్టీని వీడారు. కొడుకులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి చూపి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి మధురమ్మ మరణించారు. వీరి అన్నయ్య అంజన్న పౌరోహిత్యం చేసుకుంటున్నారు. వీరి తాత, తండ్రి ఇద్దరూ భారత స్వాతంత్య్ర సమరయోధులే. వేణుగోపాల్ వామపక్ష తీవ్రవాదంలో చేరిన తరువాత ముప్పయ్యేళ్లుగా ఇంటికి దూరంగా ఉన్నాడు. మావోయిస్టు కమాండర్ అయిన వేణుగోపాల్ భార్య తారక్క లొంగిపోయారు. మల్లోజుల పూర్వపు పీపుల్స్‌వార్ గ్రూపులో నాయకుడిగా భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పనిచేశాడు. అతను మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో గల మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేశాడు. దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళలోని గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్‌ను నెలకొల్పడానికి నియమితుడయ్యాడు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత అతను సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలు స్వీకరించాడు. దంతెవాడలో 2010 ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో 76మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసుల మరణం వెనుక ఇతని హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. పలు రాష్ట్రాల పోలీసులు అతని తలపై భారీ మొత్తాలను ప్రకటించారు. ఆయుధాలను వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఈ ఏడాది సెప్టెంబరులో మల్లోజుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటనకు మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతు ఇవ్వగా హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించారు. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్య విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరచింది. ఆయుధాలను అప్పగించాలని ఆయనను ఆదేశించింది. ఈ లేఖల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





