– ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణలో మొక్కజొన్న రైతులకు శుభవార్త. మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతుల్లో ఆనందాన్ని నింపింది. మొక్కజొన్న పంట సేకరణ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రైతుల సమస్యలను వివరించి, మద్దతు ధరకు కొనుగోళ్లను ప్రారంభించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా కేంద్రం సహకారం లేకుండానే సుమారు రూ.160 కోట్ల వ్యయంతో మొక్కజొన్న, జొన్న పంటలను మద్ధతు ధరకు సేకరించింది. రైతులను నష్టాల నుండి రక్షించేందుకు ఇదే విధానాన్ని ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెసర, మినుము, సోయా చిక్కుడు, కంది, వేరుశనగ వంటి పంటలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం 25శాతం సీలింగ్ విధించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ పరిమితిని మించి పంటల సేకరణ కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది.. కేవలం మద్ధతు ధర ప్రకటించి వదిలేయడం కాకుండా, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలుకు రాష్టాన్రికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, మిగతా పంటలపై ఉన్న 25 శాతం సీలింగ్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కూడా రాష్ట్రం కోరింది. రైతుల ఆదాయాన్ని రక్షించడానికి, పంటలకు న్యాయమైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



