– మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని అత్యంత శక్తిమంతులుగా ఇదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదు నగరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులు ఉంటే జీహెచ్‌ఎంసి పరిధిలో 30 సర్కిల్స్‌లో 50,764 సంఘాల్లో 5,09,957 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్యను రాబోయే రోజుల్లో గణనీయంగా పెంచుతామన్నారు. మెప్మా ద్వారా ఈరోజు రూ.41.51 కోట్ల వడ్డీ లేని రుణాలు చెక్కు రూపంలో అందజేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 8,130 మంది మహిళలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ నగరంలో పేద, మధ్యతరగతి వర్గానికి చెందిన అనేక కుటుంబాలు భర్తతోపాటు భార్య ఏదో ఒక చిరు వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడుతున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నదని తెలిపారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు, కొద్దిమంది వ్యక్తులు ఇది సాధ్యమేనా అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ మొదటి సంవత్సరమే రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించి రికార్డు సృష్టించామన్నారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడుల కోసం ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని, డ్వాక్రా సంఘాల్లో ఎంతమంది సభ్యులుగా చేరాలనుకుంటే వారందరినీ చేర్చుకుంటామని చెప్పారు. హైదరాబాద్ మహా నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గత పది సంవత్సరాలు వడ్డీ లేని రుణాల అంశాన్ని, మహిళా సాధికారతను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ఇపుడు ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించిందని వివరించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హైదరాబాదులో ఖరీదైన శిల్పారామంలో మహిళలు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా వద్ద వంద దుకాణాలను ప్రజా ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి లీజుకు ఇప్పిస్తుంది, ఇప్పటికే 150 బస్సులు లీజుకు ఇప్పించాం మరో 450 బస్సులు త్వరలోనే లీజుకు కు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని భట్టి తెలిపారు.
మహిళా సంక్షేమానికి పెద్ద పేట: మంత్రి సీతక్క
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ అని, ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలంటే చిన్నచూపు చూసిన కాలంలో ఉక్కు మహిళ ఇందిరమ్మ ప్రధాన మంత్రిగా మహిళా సాధికారత కోసం ఎంతో సేవ చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయని, వారిని వ్యాపార రంగాల్లో నిలబెట్టేందుకు ప్రతి ఏడాది రూ.25 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తున్నామని చెప్పారు. బ్యాంకు రుణాల ద్వారా పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. దేశంలో మొట్టమొదటిగా నారాయణపేటలో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించామని, ఆరు నెలల్లో రూ.13.80 లక్షల ఆదాయాన్ని అక్కడి మహిళా జిల్లా సమాఖ్య సంపాదించిందని మంత్రి సీతక్క వెల్లడిరచారు. హైదరాబాద్ నగరంలో 35 క్యాంటీన్లను మహిళా సంఘాలు నడుపుతున్నాయన్నారు. కోటిమంది మహిళలు కోటీశ్వరులు కావాలని లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాములను కూడా మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నాము. దీని ద్వారా మహిళా సంఘాలకు ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రతి మహిళా మహిళా సంఘంలో ఉండాలని, వడ్డీ లేని రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.బతుకమ్మ అంటే మనందరికీ బతుకునిచ్చే పండుగ, మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు పండుగ అని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేలా పాటలు రాయిస్తున్నారని, బతుకమ్మ పండుగను రాజకీయాలతో కలుషితం చేస్తున్న దుర్మార్గులని విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేసే ఈ ప్రభుత్వాన్ని మహిళలంతా దీవించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు, మహిళలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





