– మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి ‘శిక్ష’
– సీఎం ఉత్తర్వులపై విమర్శల వెల్లువ
ముంబై, ఆగస్టు 1: తప్పు చేసిన ఉద్యోగులకు శిక్షగా శాఖ మార్పులో, ప్రాధాన్యత లేని పోస్టులోకి బదిలీలో ఉంటాయి. కానీ సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రమ్మీ ఆడిన మంత్రిని శిక్షిస్తారనుకుంటే ఆయన్ను కూడా ఉద్యోగి మాదిరి ఉన్న శాఖనుంచి మరో శాఖకు బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి కరుణ చూపడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. విషయమేమంటే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కొకాటే తన మొబైల్‌లో రమ్మీ ఆడుతూ అడ్డంగా బుక్కయిన విషయం విదితమే. దీనిపై స్పందించిన సీఎం ఫడణవీస్ ఆయనను మంత్రివర్గంనుంచి తొలగిస్తారనుకుంటే క్రీడా, యువజన శాఖకు బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. పైగా ఇకపై మంత్రులెవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పే ప్రయత్నం చేశారు. సీఎం నిర్ణయంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తుండగా నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవు. వ్యవసాయ శాఖను మరో ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణేకు అప్పగించగా క్రీడా శాఖను ఇప్పటివరకు ఆయనే చూస్తున్నారు.




