– జాతర సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం
– మాస్టర్ ప్లాన్ అమలు, భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం
– సమ్మక్క-సారలమ్మల త్యాగ నిరతికి తగిన వేడుకగా నిర్వహిస్తాం
– ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో మేడారం మహా జాతర నిర్వహణ, ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. మేడారం పూజారుల సూచనల మేరకు ఆలయ ప్రాంగణం నూతన డిజైన్‌ను మంత్రులు పరిశీలించారు. అవసరమైన మార్పులపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క-సారలమ్మల త్యాగం, ఔన్నత్యాన్ని మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందన్నారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు సులభ దర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో అమర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. భక్తులు సౌకర్యంగా దర్శించుకునేలా గద్దెల ఎత్తును పెంచాలన్న పూజారుల అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి సీతక్క, జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వలంటీర్లను నియమించనున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహా జాతరకు రూ.150 కోట్లు కేటాయించినట్లు వెల్లడిరచారు. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో అదనపు నిధులు కూడా కేటాయిస్తామని తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను ముఖ్యమంత్రికి నివేదించి, ఆయన ఆమోదం తర్వాత పనులు వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారం అభివృద్ధి ప్రతి దశలో పూజారులను భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. మేడారం ఆలయంతోపాటు, పరిసర ప్రాంతాల్లోని అన్ని ఆలయాలను అలంకరించాలని ఆదేశించారు. సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర ఉన్నతాధికారులు, పలు విభాగాల ఇంజనీర్లు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





