– రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ అదాయానికి గండి
– 15మంది నిందితుల అరెస్ట్
హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 16 : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15మంది నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో కుంభకోణంలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన ముఠాలోని 15మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుండి రూ.63.19 లక్షల నగదు, బ్యాంకులోని రూ.లక్ష, సుమారు రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు.
కుంభకోణం ఇలా..
ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అన్‌లైన్ సర్వీస్ నిర్వహించేవారు. నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను అన్‌లైన్ సెంటర్లతో పరిచయం చేసుకుని చెల్లించాల్సిన మొత్తాన్ని ఎన్‌ఆర్‌ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తంలో డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి ఆ డబ్బు నుండి అన్‌లైన్ సర్వీస్ వ్యక్తులకు, మధ్యవర్తులకు కమీషన్ అందజేస్తూ ఈ-చలాన్‌లన్నింటినీ ప్రధాన నిందితుడుకి పంపేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు ధరణి/భూ భారతి వెబ్‌సైట్‌లో ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ రుసుము తగ్గించేవాడు. అనంతరం ఆ చలాన్‌ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు. ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్‌ను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించి వెబ్‌సైట్‌లో జారీ అయిన రశీదులను చెల్లించాల్సిన దానికంటే తక్కువగా మార్చి ఆ రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేవారు. నకిలీ చలాన్లను స్థానిక ఎంఆర్‌ఓ/రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారు. ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటుపడి జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్‌ల్లైన్ సర్వీసులు, మధ్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణి, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను తమ వద్దనే వెబ్‌పైట్‌లో నమోదు చేసేవారు. ఇందుకుగాను ప్రధాన నిందితులు మిగతావారికి పది నుండి 30 శాతం వరకు కమీషన్ చెల్లించేవారు. జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీలలో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. ఈ కుంభకోణానికి సంబంధించి జనగామ జిల్లాలో ఏడు కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు అయ్యాయని కమిషనర్ వెల్లడిరచారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్ నితిన్, జనగామ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథ్‌పల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎస్.ఐలు, సిబ్బందిని కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




