– రేవంత్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం
– బకాయిలు చెల్లించకుంటే చదువెలా సాగిస్తారు
– ప్రైవేట్ కాలేజీలకు మా మద్దతు కొనసాగిస్తాం
– కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 7: ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలని సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తారా అని ఫైర్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతినెలా బకాయిలు చెల్లిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా.. బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారు. బకాయిలు చెల్లించకుండా కాలేజీలను మోసం చేస్తోంది నిజం కాదా? అని అన్నారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో బండి మాట్లాడారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే మరి టోకెన్లు ఎందుకు ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చారని నిలదీశారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముందని అడిగారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్‌రెడ్డే చెప్పారు కదా అని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే కాలేజీలు ఎలా నడవాలని నిలదీశారు బండి సంజయ్. అధ్యాపకులకు జీతాలివ్వకపోతే విద్యార్థులకు చదవు చెప్పేదెవరు..? అని అడిగారు. కాలేజీ యాజమాన్యాలపై సీఎంకు ఉన్న కోపంతో విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేదాకా విద్యార్థుల, అధ్యాపకుల, కాలేజీ యాజమాన్యాల ఆందోళనకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
అధ్యాపక సభకు అనుమతి ఇవ్వలేమన్న హైకోర్టు
ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించే అధ్యాపక సభకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నందున సెక్యూరిటీ ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అధ్యాపక సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్‌పై జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. అధ్యాపక సభకు ఎల్బీ స్టేడియం లేదా మరోచోట అయినా ఫరవా లేదని అనుమతి ఇవ్వాలని సమాఖ్య లాయర్ కోరారు. అయితే కాలేజీల బంద్‌ని రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదదంటూ సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పక్రియ ముగిసే వరకు హైదరాబాద్ సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అధ్యాపక సభకు వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





