మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వంటి సంస్థలు రుణాలు ఇచ్చాయని కూడా చెపుతున్నారు. కాని ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు అధికారులు ప్రభుత్వం ఇంకా ఈ పథకానికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ తమకు సమర్పించనే లేదని, అది తమకు అంది, తాము పరిశీలించే దాకా రుణం గురించి ఆలోచించే అవకాశం లేదని స్పష్టం చేశారు.”

telanganardham venugopalఈ శీర్షికలో ఏడాదిన్నర కింద 2024 అక్టోబర్ 4న ‘ఎవరి కోసం మూసీ సుందరీకరణ?’ అని రాశాను. అందులో మూసీనది జీవనదిగా ఉన్నప్పటి నుంచి మురికి కూపంగా మారినదాకా చరిత్ర ప్రస్తావించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి వచ్చి ప్రకటించిన థేమ్స్ నది పగటికలలను విశ్లేషిస్తూ, “మూసీని పునరుద్ధరించాలంటే దానిలో ఇప్పుడు ప్రవహిస్తున్న మురుగు నీటినీ, మంచి నీటినీ వేరు చేయాలని, అంటే మూసీలో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలతో నింపకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ, నగరంలోనూ ఎగువనా ఉన్న కాలుష్య కారక పరిశ్రమలన్నిటినీ మూసివేయాలని, నది పొడవునా మరిన్ని ఎస్ టి పి లు నెలకొల్పాలని ఇంతవరకూ జరిగిన పరిశోధనలన్నీ చెప్పాయి. ఆ తర్వాతనే తీరంలో, గర్భంలో ఉన్న జనావాసాల ప్రజలకు చర్చ, సంభాషణ, నచ్చజెప్పడం, రెండు నుంచి ఐదు కి.మీ. లోపల పునరావాసం కల్పించడం అనే పని చేపట్టాలి. సుందరీకరణ అనేది జనం కోసం చేయవలసిన పని. జనాన్ని తొలగించి, మినహాయించి చేయవలసిన పని కాదు” అని ముగించాను.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అందుకు వ్యతిరేకంగా జనం కోసం కాకుండా, జనాన్ని తొలగించి, మినహాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నది. లక్షన్నర కోట్ల రూపాయల తెల్ల ఏనుగుగా మారుతున్న ఈ పథకం ప్రధానంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్నది. ఈ ప్రాజెక్టులో సేకరించిన భూమి చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, టూరిజం పేరుతో నడిచే సంపన్నుల విలాస గృహాలకు, జూదగృహాలకు, పానశాలలకు, అటువంటి మాఫియా కార్యకలాపాలకు ప్రయోజనాలు చేకూరుస్తుంది గాని అందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. గాంధీ చితాభస్మాన్ని మూసీ-ఈసా సంగమ స్థలంలో 1948 ఫిబ్రవరి 12న నిమజ్జనం చేసి, అక్కడ బాపూఘాట్ నిర్మించారు గనుక, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల ప్రాజెక్టుకు గాంధీ పేరు కూడా జోడించి విస్తారమైన భూములు ఆక్రమించి గాంధీ సరోవర్ నిర్మిస్తామంటున్నారు. భారీ గాంధీ విగ్రహం నెలకొల్పుతామంటున్నారు.

మామూలుగా ఇటువంటి పథకాలకు ముందస్తుగా తయారయి, ప్రభావిత ప్రజలందరికీ బహిరంగంగా అందుబాటులో ఉండవలసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారు కాలేదని స్వయంగా ప్రభుత్వమే అక్టోబర్ 25న ఒక ఆర్ టి ఐ దరఖాస్తుకు జవాబుగా చెప్పింది. అదే మాట ముఖ్యమంత్రి కూడా 2026 జనవరి 1న శాసన సభలో కూడా మళ్లీ చెప్పారు. కాని, అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వంటి సంస్థలు రుణాలు ఇచ్చాయని కూడా చెపుతున్నారు. కాని ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు అధికారులు ప్రభుత్వం ఇంకా ఈ పథకానికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ తమకు సమర్పించనే లేదని, అది తమకు అంది, తాము పరిశీలించే దాకా రుణం గురించి ఆలోచించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఈ మూసీ సుందరీకరణ పథకానికి దాదాపు ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది గాని, ఇప్పుడు సాగుతున్నంత దూకుడుగా, దౌర్జన్యంగా ఇంతకు ముందు జరిగినట్టు లేదు. ఈ కార్యక్రమంలో ఎక్కడా అసలీ పథకానికి అంత భూమి అవసరమా, వీలైనంత తక్కువ మంది  నిర్వాసితులయ్యేలా తక్కువ భూమి సేకరించి, పొదుపుగా వాడడం  సాధ్యం కాదా అనే దిశగా ఆలోచనలే లేవు. బాధిత ప్రజాభిప్రాయాన్ని సేకరించడం, సమూహాలతో సంప్రదింపులు, చర్చలు జరపడం, నచ్చజెప్పడం, న్యాయమైన నష్ట పరిహారాన్ని, ప్రత్యామ్నాయాలను చూపడం వంటి మర్యాదపూర్వకమైన, నాగరికమైన ప్రయత్నాలు లేవు. దౌర్జన్యపూరితంగా, బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేస్తూ, తోసుకుపోయే పనులు మాత్రం జరుగుతున్నాయి. అటువంటి దౌర్జన్యపు  పనులలో ప్రధానమైనది తెలంగాణ ప్రభుత్వం 2025 డిసెంబర్ 18న జారీ చేసిన అసాధారణ రాజపత్రం – గెజెట్. ఈ రాజపత్రాన్ని సాధారణంగా 2013 భూసేకరణ, పునరావాసం,  పునః స్థిరీకరణ    చట్టంలో అధ్యాయం 2, 3 లలో ఉండిన నిబంధనల నుంచి ఈ ప్రాజెక్టును మినహాయించాలనేది. ఇందులో రెండో అధ్యాయం ప్రభుత్వం భూమి సేకరించదలచిన ఏ  పథకానికైనా  అది ఎటువంటి సామాజిక ప్రభావాన్ని కలజేస్తుందో మదింపు జరపాలని, ఆ పథకం ప్రజా ప్రయోజనకరం అవునో కాదో నిర్ధారించాలని, ఆ నివేదికను నిపుణుల బృందం పరీక్షకు పంపాలని చెపుతుంది. మూడో అధ్యాయం ఈ పథకం వల్ల ప్రజల ఆహార భద్రత దెబ్బ తినకుండా రక్షణాలు కల్పించాలని నిర్దేశిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు అధ్యాయాల నుంచి మినహాయింపు కావాలని కోరుతున్నదంటే  అర్థం ఏమిటి? ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం అని ఒక పథకం  తెస్తుంది. కానీ అది ప్రజా ప్రయోజనమేనా కాదా ఎవరూ చర్చించగూడదు, ఆ పథకం వల్ల సమాజం మీద ప్రతికూల ప్రభావాలు పడతాయా, ప్రజల ఆహార భద్రతకు భంగం వాటిల్లుతుందా అని పరిశీలించగూడదు. ఇది రాజపత్రం కాదు, అరాచక పత్రం. ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాలు బైటికి రాకుండా తొక్కిపట్టే దుర్మార్గ పత్రం. ప్రజాస్వామిక ప్రజా సంప్రదింపుల ప్రక్రియను రద్దు చేస్తున్న నిరంకుశ పత్రం.

“అంత మంది నిర్వాసితుల ఆశలు, కలలు, మానవ సంబంధాలు, సహకారాలు అన్నీ ఒక్క కలం పోటుతో రద్దయిపోతాయి. వారిలో అత్యధికులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, రోజు కూలీ శ్రామిక జనావళి గనుక నివాస స్థలం నుంచి మారడం, ఎక్కడో దూరానికి వెళ్లవలసి రావడం వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. ఒక్కసారిగా పది పక్షాల మంది కొత్త నివాస స్థలాల కోసం, నివాస గృహాల కోసం వెతుకులాటకు దిగడం మొత్తంగా నగర గృహవసతి స్థితి మీద ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు సేకరిస్తున్న భూమిలో చెప్పుకోదగిన స్థాయిలో వ్యవసాయ భూములు, ముఖ్యంగా కాయగూరల పంట భూములు ఉన్నాయి గనుక ఆమేరకు ఆహార భద్రత సమస్యలు కూడా వస్తాయి.”

రాజపత్రం తెచ్చిన ఉద్దేశం అంత దుర్మార్గమైనది కాగా, “కనీస పరిమాణపు భూమి సేకరించడానికి అన్ని ఏర్పాట్లూ చేసి” ఆ అధికారాన్ని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలో భూసేకరణ కోసం నియమించిన స్పెషల్ కలెక్టర్ కు అప్పగించింది. అది చెప్పిన “కనీస పరిమాణపు భూమి” 3,279 ఎకరాల 19 గుంటలు. ఈ సువిశాల స్థలంలో ఇప్పటికే 10,017 నిర్మాణాలు, భవనాలు, ఆస్తులు ఉన్నాయని కూడా రాజపత్రం చెపుతుంది. అంటే ఈ పథకాన్ని మూసీ సుందరీకరణ పథకం అనడం కన్నా మూసీ బకాసురీకరణ పథకం అనడం సరైనది. ఈ బకాసురుడి ఆకలికి బలి అయి, నిర్వాసితులు అయ్యే వారి సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేం. 10,017 నిర్మాణాలు అంటే, అందులో అత్యధికం బహుళ అంతస్తుల, బహు ఫ్లాట్ల నిర్మాణాలు ఉండవచ్చు గనుక, నిర్వాసితుల సంఖ్య ఒక లక్ష మంది నుంచి పది లక్షల మంది దాకా ఉండవచ్చు. ఇంతకు ముందే, 2024 అక్టోబర్ లో చాధర్ షూట్ నుంచి కింద మూసానగర్, రసూల్ పురా, వినాయక్ నగర్, శంకర్ నగర్ బస్తీలలో రాత్రికి రాత్రి బుల్డోజర్లతో 200 భవనాలు కూల్చి, 400 కుటుంబాలను నిర్వాసితులను చేశారు. వారికి చట్టబద్ధంగా ఇవ్వవలసిన పునరావాస, పునః స్థిరీకరణ సౌకర్యాలు పూర్తిగా కల్పించలేదు. ఇప్పుడు బాపూ ఘాట్ సమీపంలో హైదర్షాకోట్ ప్రాంతంలో కనీసం పన్నెండు మధ్య తరగతి కాలనీలు, అత్తాపూర్, జియాగూడ ప్రాంతాలలో 50 మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కాలనీల్లో సర్వేచేసి, ప్రాజెక్ట్ ప్రభావిత గుర్తులు పెట్టారు. బండ్లగూడ జాగీర్ 10 ఎకరాలలో ఉన్న మధ్యతరగతి నివాస గృహాలకు, ముస్లిం ప్రార్థనా స్థలానికి నోటీసులు పత్రికల్లో ప్రకటించారు.

అంత మంది నిర్వాసితుల ఆశలు, కలలు, మానవ సంబంధాలు, సహకారాలు అన్నీ ఒక్క కలం పోటుతో రద్దయిపోతాయి. వారిలో అత్యధికులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, రోజు కూలీ శ్రామిక జనావళి గనుక నివాస స్థలం నుంచి మారడం, ఎక్కడో దూరానికి వెళ్లవలసి రావడం వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. ఒక్కసారిగా పది పక్షాల మంది కొత్త నివాస స్థలాల కోసం, నివాస గృహాల కోసం వెతుకులాటకు దిగడం మొత్తంగా నగర గృహవసతి స్థితి మీద ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు సేకరిస్తున్న భూమిలో చెప్పుకోదగిన స్థాయిలో వ్యవసాయ భూములు, ముఖ్యంగా కాయగూరల పంట భూములు ఉన్నాయి గనుక ఆమేరకు ఆహార భద్రత సమస్యలు కూడా వస్తాయి.

మళ్లీ మూలంలోకి వెళ్తే, గెజెట్ ద్వారా ప్రభుత్వం అసలు ఈ పథకం ప్రజా ప్రయోజనం అవునా కాదా చర్చించే అవకాశాన్నే రద్దు చేసింది గాని, ప్రజలకు ఒక జీవనది, ఆహ్లాదకరమైన పర్యావరణం, నగర జీవితపు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇచ్చే విహారస్థలం అవసరమే అన్నంతవరకు మాత్రమే ఇది ప్రజా ప్రయోజనం. అందుకు లక్షల మందిని నిర్వాసితులను చేసి వేల ఎకరాలు ఆక్రమించనవసరం లేదు. ఇప్పటివరకూ, ప్రభుత్వాలు సేకరించిన భూముల్లో పదో వంతు కూడా చెప్పిన ప్రయోజనానికి వినియోగం కాలేదు. ఇతర కారణాలకు, ఆశ్రితులకు, సంపన్నులకు చౌకగా, ఉచితంగా కట్టబెట్టడానికే ఉపయోగపడ్డాయి. ఈ నదీ తీర్పు భూమి అలా దుర్వినియోగం కావడానికే అవకాశం ఎక్కువ.

ఇంకొక విచిత్రమైన అంశం, ఈ దౌర్జన్య సేకరణకు చట్టబద్ధత అనే సిగ్గుబిళ్ల తగిలింధడానికి ‘కూల్చివేయనున్న నివాస భవనాలన్నీ, సేకరించనున్న భూమిలో నిర్మాణాలన్నీ బఫర్ జోన్ లో ఉన్నవే’ అని అధికారులు ప్రకటిస్తున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదమైన, క్రూరమైన మాట మరొకటి ఉండదు. ఈ బఫర్ జోన్ అనే మాట ఒక పరిహాసం. ఇప్పటివరకూ మూసీ నది ఉపగ్రహ చిత్రాలు లేవనీ, తయారు చేస్తున్నామని అధికారులే ఒకవైపు అంటున్నారంటే బఫర్ జోన్ నిర్ధారణకు అవసరమైన మౌలిక ప్రాతిపదికలు లేవన్నమాట. సాధారణంగా చిన్న నదులకు, పెద్ద నదులకు వేరు వేరు బఫర్ జోన్ నిబంధనలు ఉంటాయి. బఫర్ జోన్ లోపల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడం ఏ నగరంలోనైనా జరుగుతుంది. కాని విచిత్రమేమంటే, మూసీ బఫర్ జోన్ 2004 వరకు 12 మీటర్లుగా ఉండేది. అంతకు ముందు 9 మీటర్లు ఉండేదంటారు. 2009 నాటికి దాన్ని 30 మీటర్లకు పెంచారు. 2012 తర్వాత దాన్ని 50 మీటర్లు చేశారు. అంటే ఆయా సంవత్సరాలకు ముందు బఫర్ జోన్ కాని చోటనే, ప్రభుత్వ అనుమతులతోనే నిర్మాణాలు జరిగి ఉంటాయి. అనుమతి లేకుండా జరిగిన నిర్మాణాలకు కూడా తర్వాత కాలంలో అవినీతి వల్ల, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ల వల్ల అనుమతులు వచ్చి ఉంటాయి.

మూసీ తీరంలో చాదర్ ఘాట్ దర్వాజా మురికివాడ, మూసా నగర్ 70 సంవత్సరాలుగా, జుమెరాత్ బజార్, కాంగార్ నగర్ 55 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నాయి. ఈ నివాస ప్రాంతాలన్నిటికీ మునిసిపల్ అధికారులు ఇళ్ల నంబర్లు ఇచ్చారు, పన్నులు వసూలు చేస్తున్నారు, మంచి నీటి, మురుగు నీటి సౌకర్యాలు కల్పించారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా స్తంభాలు నాటారు, ఇళ్లకు విద్యుత్తు ఇచ్చారు, నెలనెలా బిల్లులు వసూలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలనూ ఈ మూసీ తీర “అక్రమ” జనావాసాల వోటర్లే పోషిస్తున్నారు. దశాబ్దాలుగా సజావుగా సాగిన ఈ అక్రమాలనూ, ఆ అక్రమాల అసలు బాధ్యులనూ పక్కన పెట్టి, ఇప్పుడు వారిని బఫర్ జోన్ నివాసులుగా పేరు మార్చి వెళ్లగొడతామనడం దౌర్జన్యం కాక మరేమిటి? పైగా, ఇప్పుడు నా బఫర్ జోన్ నిర్వచనం మారింది గనుక, నేను గతంలో ఇచ్చిన అనుమతి చెల్లదు అనడం అమానవీయం. అమెరికా మెక్సికోను ఆక్రమించి మెక్సికన్లను సరిహద్దు దాటిన చొరబాటుదారులు అని నిర్బంధిస్తున్నప్పుడు మెక్సికన్లు ఒక నినాదం ఇచ్చారు: “మేం సరిహద్దులు దాటలేదు, సరిహద్దులే మమ్మల్ని దాటాయి” అని. అట్లాగే ఇప్పుడు 10,017 నిర్మాణాలు బఫర్ జోన్ లో అక్రమంగా కట్టినవి కావు, బఫర్ జోన్ పెంచినందువల్ల అక్రమమైనవిగా ముద్రపడినవి.

ఇది ప్రజల కోసం సుందరీకరణ కాదు, కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల సంపదీకరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *