నిజమైతే బాగుండనుకునే అర్థరాత్రి కలలోంచి అమాంతం ఉలిక్కిపడ్డ తాజా నిట్టూర్పువు నువ్వు…
కూలిన కలల శిథిలాల్లో చిక్కుకున్న నవ్వుల్ని తలుచుకుంటూ విలపిస్తూ ఉండుంటావు,
ఈ సమయాన్ని దాటనివ్వు.
ప్రతిసారీ భోజనం సజావుగా సాగాలని లేదు,
పరమాన్నపు రుచి ఘడియలున్నట్టే,
పంటికింద రాయిలాంటి క్షణాలు ఉంటాయి,
ఒకటాస్వాదించినట్టే, మరోటి ఆహ్వానించి తీరాలి..!
2)
పరీక్షకొక ముందురాత్రి వెచ్చబడ్డ పిల్లాడి శ్వాస లాంటిదేదో ఇంకా నిన్ను కలవరపెడుతున్నట్టుంది,
బలపాల ఈడు దాటి, వెన్నులో గునపాల ఈడు దాకా,
తెలిసిన దారుల్లోనో, దారుల్ని తెలుసుకుంటూనో ఇక్కడివరకూ చేరుకున్నావు,
మిగిలుందిక కాస్త దూరమే,
కళ్ళకు గమ్యం కనిపించట్లేదని కాళ్లకు తెలియనివ్వకు.
3)
నచ్చని రీల్ ను తప్పించే స్వేచ్ఛను వెలికొసకు ఎలాగైతే అప్పగించావో…
నప్పని సమయాల్ని దాటేసే హక్కును మనసుని లాక్కోనివ్వాలి…
4)
కాలం ఒంటిచేతిదేం కాదు,
ఒక చేత్తో దిగులు జల్లుల్ని చల్లాక సుడులు తిరిగే మన కళ్ళకు ఇంకో చేయి కనిపించదు కానీ,
అవర్ణమైన నీ కంటి ముత్యాల్ని తుడిచేందుకు మరో గుప్పిట్లో రంగురంగుల రుమాలును దాచుంచింది…
5)
నెట్టేసే చేయుండాలి,
కిందపడితే గాయపరచడానికొక ముళ్ల దారుండాలి,
రక్తం బొటబొట కారుతుండాలి,
ఇదంతా చూసి కసితీరా నవ్వడానికొక్క నోరైనా నీ దారిదాపుల్లో ఉండి తీరాలి…
ఆఁ…
అదిగో ఆ తర్వాత…
ఆ సమయాన్ని దాటిన తర్వాతే,
ఇక నువ్వు నువ్వు కావు,
నువ్వింకెవరివో….
జాబేర్. పాషా





