కాళ్ల కింద నేల కదులుతోంది, గమనించారా?

“అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం గురించి. మొదటి సారిగా ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకున్నఅవిశ్వాసం గురించి.”

సంక్షోభం అంటే ఏమిటి? యథాతథస్థితి చెదిరిపోవడానికి దారితీసే పరిణామాలేమిటి? సర్వంసహా చక్రవర్తులు, తిరుగులేని అధికారాన్ని చెలాయించే నియంతలు కూడా ఏదో ఒకదశలో ఎందుకు బలహీనులవుతారు? ధర్మం ఒక్కపాదం మీద కూడా నడవని స్థితి వచ్చినప్పుడు ఎందుకు లోకధేనువు కుప్పకూలిపోతుంది?

నరేంద్రమోదీ, ఆయన పార్టీ నిన్నమొన్నటిదాకా సాగించిన విజృంభణ చూసినప్పుడు, కనుచూపుమేరలో దానికి నిష్కృతి కనిపించలేదు. బయటినుంచి పోటీ ఇవ్వగల ప్రత్యర్థులు లేరు, లోపలినుంచే ఎవరో ఒకరు అస్థిరపరిస్తే తప్ప, ఈ పాలనకు తిరుగులేదు- అన్నవిశ్లేషణలు వినిపిస్తూ వచ్చాయి. ఎన్నికల ద్వారా జరగగల మరమ్మత్తు కూడా 2024 సాధారణ ఎన్నికల్లో, గురికి బెత్తెడు దూరంలో నిలిచిపోయింది. ఊతకర్రల సాయంతో తాబేటినడక కాక, బయటి మద్దతుదారులను కూడా విధేయులను చేసుకుని ప్రభుత్వం పరుగులు తీస్తూనే ఉంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను ఖాతరు చేయని నిరంకుశత్వాన్ని నిలబెట్టినది ఏది? ప్రజామోదం కొంత, భారతీయ సమాజంలో ఆలోచనాసరళిని, విశ్వాస సంపుటిని తలకిందులు చేయగలిగిన ప్రచారకథనాల ప్రభావం కొంత అధికారసౌధానికి సుస్థిరత ఇస్తూ వచ్చాయి. భారత రాజ్యాన్ని సరైన దారిలోకి మళ్లిస్తున్నాడని, లోపలి- బయటి శత్రువుల నుంచి ప్రజలను రక్షిస్తున్నాడని, మైనారిటీలను రెండోతరగతికి కుదించడం ద్వారా తమను ప్రథమశ్రేణి లోకి ఎదిగించాడని, కునారిల్లిపోయి ఆత్మవిశ్వాసం అంతరించిన భారతీయ ఆత్మకు విశ్వాసాన్ని, గర్వాన్ని సమకూరుస్తున్నాడని నరేంద్రమోదీని, రాజ్యాంగ వ్యవస్థల మీద కంటె హెచ్చు విశ్వాసంతో, ప్రజలు అభిమానించారు. తమకు మంచి చేస్తున్నప్పడు, తమ మనోభావాలను ఉత్తేజపరుస్తున్నప్పుడు, రాజ్యాంగవిలువలను పాటిస్తే ఏమిటి, పాటించకపోతే ఏమిటి, వాటికి సవరింపులు చేస్తే ఏమిటి- అన్న బేఖాతరు ధోరణిలో మెజారిటీ భారతీయ సమాజం పడిపోయింది.

మరి ఇప్పుడు అట్లాగే ఉందా? సజావుగా సాగుతున్న ఆకాశయానంలో ఈ కుదుపులు ఏమిటి?
అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం గురించి. మొదటి సారిగా ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకున్నఅవిశ్వాసం గురించి.

నైతిక ప్రాతిపదికలనే అంగీకరించనివారికి నైతికసంక్షోభమేమిటి అని విమర్శకులు ప్రశ్నిస్తారు. ఒంటి పాదంతో నడిచినప్పుడు కూడా, ఎంతో కొంత బేలన్స్‌ ఉంటుంది. ఆ ఒక్క కాలు కూడా కుంగినప్పుడు, వ్యవస్థ కంపిస్తుంది. నరేంద్రమోదీ, ఆయన పార్టీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వానికి లెజిటమసీ ఇస్తున్న అంశాలన్నీ పూర్వపక్షమైపోతున్న సన్నివేశంలో ఇప్పుడు ఉన్నాము.

“ప్రజలలో ప్రభుత్వానికి ఉన్న ఉద్వేగపూరితమైన మద్దతు , వివిధ వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి అడ్డుగా ఉంటుంది కూడా. ఒకరకమైన భయంతో కూడిన ఒత్తిడి న్యాయమూర్తుల మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. మరొక రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం, కమిషనర్ల ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేబినెట్‌ మంత్రికి చోటు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. ఫలితంగా, ముగ్గురి ఎంపిక కమిటీలో ప్రధాని, ఆయన కేబినెట్‌ సహచరులొకరు, ప్రతిపక్షనాయకులు సభ్యులు కావడంతో ఏకపక్ష నిర్ణయాలకు ఆస్కారం కలిగింది. ఆ చట్టసవరణ న్యాయపరీక్షలో ఉండగానే, ప్రస్తుత కమిషనర్లును ఈ ఏడాది కొత్త పద్ధతిలో నియమించడం వివాదం అయింది. ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుంచి తొలగించడంతో సగం విశ్వసనీయత కోల్పోయిన ఎన్నికల సంఘం, కొత్తనియామకాలు చేసిన తీరుతో మరింత అప్రదిష్ఠ పాలయింది.”

2014లో అధికారానికి వచ్చిన వెంటనే బిజెపి మీడియాను ప్రక్షాళన చేసేపనిలో పడింది. సామాజిక మాధ్యమాలను బహుముఖ ప్రయోజనాలకు వినియోగించుకునే భారీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. మరోవైపు, అధికారయంత్రాంగంలో మార్పులు చేసుకుంది. చట్టసభలలో తిరుగులేని బలం ఎట్లాగూ ఉన్నది. న్యాయవ్యవస్థతో కొంత సమస్య వచ్చింది కానీ, కీలకవిషయాల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడింది. కొందరు న్యాయమూర్తులకు పదవీవిరమణానంతర పునరావాసాలు కల్పించారు. కొందరి చేతికి కీలకవ్యాజ్యాలు రాకుండా చూసుకున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని తగిన విధంగా చతుర్విధ ఉపాయాలతో నిర్వహిస్తూనే, మొత్తంగా న్యాయవ్యవస్థకు అధికారాలు తగ్గించడానికి ప్రయత్నాలు చేశారు. ప్రజలలో ప్రభుత్వానికి ఉన్న ఉద్వేగపూరితమైన మద్దతు , వివిధ వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి అడ్డుగా ఉంటుంది కూడా. ఒకరకమైన భయంతో కూడిన ఒత్తిడి న్యాయమూర్తుల మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. మరొక రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం, కమిషనర్ల ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేబినెట్‌ మంత్రికి చోటు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. ఫలితంగా, ముగ్గురి ఎంపిక కమిటీలో ప్రధాని, ఆయన కేబినెట్‌ సహచరులొకరు, ప్రతిపక్షనాయకులు సభ్యులు కావడంతో ఏకపక్ష నిర్ణయాలకు ఆస్కారం కలిగింది. ఆ చట్టసవరణ న్యాయపరీక్షలో ఉండగానే, ప్రస్తుత కమిషనర్లును ఈ ఏడాది కొత్త పద్ధతిలో నియమించడం వివాదం అయింది. ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుంచి తొలగించడంతో సగం విశ్వసనీయత కోల్పోయిన ఎన్నికల సంఘం, కొత్తనియామకాలు చేసిన తీరుతో మరింత అప్రదిష్ఠ పాలయింది.

నరేంద్రమోదీ ప్రభుత్వానికి జనాదరణ అందించిన అంశాలలో తీవ్ర జాతీయవాదం ఒకటి. పెహల్గాం సంఘటన అనంతరం మోదీ వెనుక సమీకృతమైన దేశం, పాకిస్థాన్‌ మీద బాలాకోట్‌ దాడులకు మించిన గట్టి చర్యను ఆశించింది. అట్లా ఆశించే విధంగా ‘పెహల్గామ్‌’ అనంతర కథనాలు ప్రభావితం చేశాయి కూడా. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అటువంటి సంతృప్తిని ఇస్తుందని మోదీ అభిమానులైన జాతీయవాదులు అనుకున్నారు. అర్థాంతరంగా ఆ సైనికచర్య ముగియడం, ఆ నిర్ణయం వెనుక తన ఒత్తిడి ఉన్నదన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు పదే పదే ప్రకటించడం, మోదీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. పాకిస్థాన్‌ కాళ్లబేరానికి వచ్చినందునే ఆపరేషన్‌ను నిలిపివేశాం అని ప్రభుత్వం ఎంత చెప్పినా, అందుకు విరుద్ధమైన ప్రకటనలు అమెరికా నుంచి, పాకిస్థాన్‌ నుంచి కూడా వచ్చాయి. పైగా, పాకిస్థాన్‌కు తాను అండగా ఉంటున్నట్టు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక సంకేతాలు ఇస్తూ వచ్చారు. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో ఆత్మరక్షణలో పడినట్టు స్పష్టంగా కనిపించింది. ఈ నెలలో ప్రధాని అమెరికా పర్యటన, ట్రంప్‌ను మంచి చేసుకోవడానికేనని, అది ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చెప్పలేమని అంటున్నారు. పాక్‌ వివాదానికి తోడు, టారిఫ్‌ ల విషయంలో ట్రంప్‌ భారత్‌తో వ్యవహరిస్తున్న తీరు, దానికి దీటైన ప్రతిస్పందన ఇవ్వడంలో మోదీ ప్రభుత్వ వైఫల్యం, తన కీలక బలాలైన జాతీయవాద, దేశభక్తి భావనల్లో బిజెపి ప్రతిష్ఠను నష్టపోయేట్టు చేసింది. .

ఆగస్టు 15 ఎర్రకోట ప్రసంగం మోదీకి ఒక కీలకమైన అవకాశం. ఆర్థికరంగంలో అమెరికా చేస్తున్నఅన్యాయమైన ఒత్తిడిని, పాకిస్థాన్‌తో అది చేస్తున్న మైత్రిని స్పష్టమైన, దృఢమైన స్వరంతో ఆయన ఖండించి ఉండవలసింది. కానీ, తిరిగి పాకిస్థాన్‌ ను ఉద్దేశించి మాత్రమే ప్రధాని భీషణ ప్రతిజ్ఞలు చేశారు. అమెరికా సుంకాల దాడి నుంచి దేశరైతాంగాన్ని కాపాడతామని చెప్పవలసింది పోయి, భారతీయరైతులకు దక్కవలసిన సింధుజలాలను కాపాడుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో చెప్పినట్టు, చైనా చొరబాటును కానీ, అమెరికా ఒత్తిడిని కానీ ఎదుర్కొనలేని బలహీనతలో కేంద్రం పడిపోయింది. పాకిస్థాన్‌ కు మాత్రమే హెచ్చరికలు చేయగలిగే స్థితిలో ఉండడం జాతీయవాద ఫ్రంట్‌ లో బిజెపి ప్రభుత్వ బేలతనాన్ని సూచిస్తోంది.

“రాహుల్‌ వెల్లడి వల్ల ఎన్నికలసంఘమే కాదు, ప్రధాన మీడియా కూడా మరోసారి బోనెక్కింది. మీడియా ప్రాధాన్యాలు ఎట్లా ఉంటాయో, ఎంతగా తిమ్మిని బమ్మి చేస్తాయో, రాహుల్‌ సుదీర్ఘ ప్రెస్‌ మీట్‌ కు ఇచ్చిన కవరేజ్‌ బట్టబయలు చేసింది. ఒక ప్రజాప్రాముఖ్యమున్న అంశాన్ని అప్రధానం చేయడంలో ఎవరు ఎవరితో కుమ్మక్కై పనిచేస్తున్నారో ఏమంత రాజకీయ పరిజ్ఞానం లేని సామాన్యులకు కూడా అర్థమై పోయింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అని చెప్పే మీడియా పతన దశ గురించి ఇంతకుముందు నుంచి అనుకుంటున్నదే కానీ, ఈ ఘట్టంలో అది తిరుగులేని వాస్తవంగా ముందుకు వచ్చింది.”

ఈ నెల ఏడో తేదీన రాహుల్‌ గాంధీ పేల్చిన ‘ఆటంబాంబు’ మోదీ ప్రభుత్వాన్ని చాలా సంకటంలో పడవేసింది. ఓట్ల దొంగతనానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ మీద సోదాహరణంగా చేసిన విమర్శలు, సమాధానం లేనివి. ఎన్నికల సంఘం చాలా బలహీనమైన ప్రతిస్పందనలు మాత్రమే ఇవ్వగలిగింది. ఎన్నికలసంఘాన్ని సమర్థించుకుంటూ రంగంలోకి దిగడం బిజెపిని సహముద్దాయిని చేసింది. ఎన్నికలసంఘం-బిజెపి కలసి ఈ ఓట్ల దొంగతనం చేస్తున్నారన్నట్టు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణకు బలం చేకూరింది. రాహుల్‌ వెల్లడించిన వివరాలకు సమాధానం ఇవ్వకుండా, పోటీ ఆరోపణలు చేయడం, సాంకేతికంగా మార్పిడి చేసిన డాక్యుమెంట్లను ప్రచారంలో పెట్టడం, బిజెపిని మరీ పలచన చేసింది.

రాహుల్ గాంధీ బెంగుళూరులోని ఒక నియోజకవర్గాన్నినమూనాగా తీసుకుని పరిశోధన చేశారు కానీ, ఆయన అక్రమాలను ఆవిష్కరించిన సందర్భం ఎన్నికల సంఘం బిహార్‌లో నిర్వహిస్తున్న ‘సర్‌’ ( ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ) కార్యక్రమం. తాను బయటపెట్టిన ‘ఓట్ల దొంగతనం’ నేపథ్యంలోనే, ఈ ఆదివారం నుంచి రాహుల్ గాంధీ బిహార్‌ లో ‘ఓట్‌ అధికార్‌ యాత్ర’ను తలపెట్టారు. దీనికంతా కూడా అతిత్వరలో జరగనున్న బిహార్‌ ఎన్నికలు నేపథ్యం అన్నది తెలిసిందే. సుప్రీంకోర్టు ‘సర్‌’ విషయంలో పారదర్శకత కోరుతూ ఆదేశాలు ఇవ్వడం కూడా ఈ వాతావరణంలోనే జరిగింది. బిహార్‌ ప్రయోగం ద్వారా కేంద్రప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇప్పుడు సమకూరకపోవచ్చు.

ఎర్రకోట ప్రసంగంలో ఈ ఉదంతాన్ని ప్రధాని ప్రస్తావించలేదు. కానీ, తాము దేశమంతటా చొరబాటుదారులు, అక్రమవలసదారులను (ఘుస్‌పేటియే) గుర్తించి చర్యలు తీసుకోవడం గురించి గొప్పగా చెప్పారు. సరిహద్దుల నుంచి వస్తున్న ఈ పరాయివారు, భారతీయుల ఉద్యోగాలను, వ్యాపారాలను అపహరిస్తున్నారని, ఆడవాళ్లను కూడా లాగేసుకుంటారని, ఏమంత హుందాగా లేని రీతిలో హెచ్చరించారు. ‘సర్‌’ కార్యక్రమానికి ఈ చొరబాటుదారుల తొలగింపును సమర్థనగా ప్రచారం చేసి, రాహుల్‌ యాత్రను బిజెపి ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ, రాహుల్‌ గాంధీ వెల్లడి వల్ల , దేశప్రజలకు ఓటర్ల జాబితాల మీద, ఎన్నికల ప్రక్రియ మీద, మొత్తంగా ఎన్నికల యంత్రాంగం మీద అపనమ్మకం అయితే ఏర్పడింది. ఆ అపనమ్మకాన్ని ఈ చొరబాటుదారుల ప్రక్షాళన ఆశయం ఎదుర్కొనగలదా? ఓటర్ల తొలగింపునకు బిజెపి, మోదీ చెబుతున్న కారణాలను ప్రజలు నమ్ముతారా?

“ఎర్రకోట మీద తొలిసారిగా ఒక ప్రధాని ఆర్‌ఎస్‌ఎస్‌ను కీర్తించడం విశేషమే. ఆ సంస్థ నూరేళ్ల పండగ సందర్భంగా ఒక సంఘ్‌ ప్రచారక్‌ అయిన మోదీ ఆ పని చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతమాత్రమేనా, ఈ సంక్షోభం నుంచి తనను గట్టెక్కించమని ‘సంఘ్‌’ కు అభ్యర్థన పంపడం కూడా ఆ ప్రశంసలో ఇమిడి ఉందా? డెబ్బైఅయిదేళ్ల వయస్సు సందర్భంగా ప్రభుత్వసారథ్యంలో మార్పును ‘సంఘ్‌’ కోరుతోందని కథనాలు వచ్చాయి. మరో పక్క, ప్రతిపక్షంలో ఐక్యత, చొరవ, క్రియాశీలత పెరిగింది. ప్రభుత్వం దగ్గర కొత్త రాజకీయ ఆయుధాలు ఏవీ లేవని, పార్టీలో ప్రభుత్వంలో సృజనాత్మకత లోపించిందని ఎర్రకోట ప్రసంగం సూచిస్తోంది.”

రాహుల్‌ వెల్లడి వల్ల ఎన్నికలసంఘమే కాదు, ప్రధాన మీడియా కూడా మరోసారి బోనెక్కింది. మీడియా ప్రాధాన్యాలు ఎట్లా ఉంటాయో, ఎంతగా తిమ్మిని బమ్మి చేస్తాయో, రాహుల్‌ సుదీర్ఘ ప్రెస్‌ మీట్‌ కు ఇచ్చిన కవరేజ్‌ బట్టబయలు చేసింది. ఒక ప్రజాప్రాముఖ్యమున్న అంశాన్ని అప్రధానం చేయడంలో ఎవరు ఎవరితో కుమ్మక్కై పనిచేస్తున్నారో ఏమంత రాజకీయ పరిజ్ఞానం లేని సామాన్యులకు కూడా అర్థమై పోయింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అని చెప్పే మీడియా పతన దశ గురించి ఇంతకుముందు నుంచి అనుకుంటున్నదే కానీ, ఈ ఘట్టంలో అది తిరుగులేని వాస్తవంగా ముందుకు వచ్చింది.

‘సర్‌’ మీద కొంత సానుకూల నిర్ణయాన్ని ప్రకటించి న్యాయవ్యవస్థ ఆశను మిగిల్చింది కానీ, ఇటీవలి పరిణామాలు తక్కిన వ్యవస్థలన్నిటి మీద తీవ్రమైన సంశయాన్ని కలిగించాయి. ఈ సంశయస్థితిని ఎంతోకొంత సవరించలేకపోతే, ప్రభుత్వానికి ఆమోదనీయత ఉండదు. అది లేకపోతే, అధికారంలో కొనసాగడానికి మరింత తీవ్రమైన నిరంకుశ విధానాలను అనుసరిస్తూ, హెచ్చు స్థాయిలో బలప్రయోగాన్ని, నిర్బంధచర్యలను ఆశ్రయించవలసి వస్తుంది. లేదా, సంస్థాగతంగా కలిగే కల్లోలానికి గురి కావలసి వస్తుంది.

ఎర్రకోట మీద తొలిసారిగా ఒక ప్రధాని ఆర్‌ఎస్‌ఎస్‌ను కీర్తించడం విశేషమే. ఆ సంస్థ నూరేళ్ల పండగ సందర్భంగా ఒక సంఘ్‌ ప్రచారక్‌ అయిన మోదీ ఆ పని చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతమాత్రమేనా, ఈ సంక్షోభం నుంచి తనను గట్టెక్కించమని ‘సంఘ్‌’ కు అభ్యర్థన పంపడం కూడా ఆ ప్రశంసలో ఇమిడి ఉందా? డెబ్బైఅయిదేళ్ల వయస్సు సందర్భంగా ప్రభుత్వసారథ్యంలో మార్పును ‘సంఘ్‌’ కోరుతోందని కథనాలు వచ్చాయి. మరో పక్క, ప్రతిపక్షంలో ఐక్యత, చొరవ, క్రియాశీలత పెరిగాయి. ప్రభుత్వం దగ్గర కొత్త రాజకీయ ఆయుధాలు ఏవీ లేవని, పార్టీలో ప్రభుత్వంలో సృజనాత్మకత లోపించిందని ఎర్రకోట ప్రసంగం సూచిస్తోంది.

‘ధర్మం’ అంటే అనేకార్థాలు ఉన్నాయి కానీ, ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల నిలకడకి ప్రజల ఆలోచనల్లో ఉండే ఆమోదనీయత అటువంటిదే. ఆ లెజిటమసీ అనే ధర్మం లోపించి, ఒక్కకాలు కూడా వ్యవస్థకు ఊతం అందించని స్థితి వచ్చింది. ఇరుసులు విరిగిన రథం ఎంత దూరం పరుగులు తీయగలదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *