ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడండి

– భారత ప్రజలకు కేంద్రం అడ్వయిజరీ

న్యూదిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని తెలిపింది. తాము సూచించిన మార్గాల్లో మాత్రమే దేశాన్ని వీడాలని, ఎంబసీని సంప్రదించకుండా, అనుమతి తీసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లరాదని పౌరులను హెచ్చరించింది. అలాగే కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను షేర్ చేసింది. ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ కావడం గమనార్హం. మంగళవారం రాత్రి కూడా కేంద్ర విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ఇళ్లల్లోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యుద్ధం తాత్కాలికంగా ఆగడంతో స్వదేశానికి రావాలనుకునేవారికి ఇదొక అవకాశంగా మారింది.

మార్కెట్లకు జోష్ : భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

ఇరాన్‌పై రెండు వారాలపాటు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా భారీగా దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడింది. సెన్సెక్స్, నిప్టీ మూడు శాతానికి పైగా లాభంతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు (74,616)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 2500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ జోరు కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత 77 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 2670 పాయింట్ల లాభంతో 77,286 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిప్టీ కూడా లాభాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 777 పాయింట్ల నష్టంతో 23,900 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్, నిప్టీలో అశోక్ లేలాండ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మదర్సన్, ఎల్ అండ్ టీ నాన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆయిల్ ఇండియా, నాల్కో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిప్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1843 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిప్టీ 2473 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.55గా ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *