బాలలపై లైంగిక వేధింపులు, రక్షణ అంశంపై సదస్సులో సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్‌తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంతో కీలకమైన ఈ అంశంపై సదస్సు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసు, ఇతర నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో బాలలపై లైంగిక వేధింపులు, రక్షణ అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇలాంటి నేరాలను నియంత్రించడమేకాక బాల బాధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బాలికల సంరక్షణ కోసం తెలంగాణ భరోసా ప్రాజెక్టును తీసుకొచ్చిందని సీఎం తెలిపారు. దీనికి అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా పోలీసు సహాయమేకాక న్యాయపరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్ వంటి సేవలను అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేసులను వేగవంతంగా పరిష్కరించడమేకాక పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ కేంద్రాల లక్ష్యమని చెప్పారు. పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలుగా పనిచేస్తున్నాయని, అయితే ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాగతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. న్యాయం కేవలం కోర్టుల్లోనే కాకుండా ప్రతి దశలోనూ రక్షణ ఉండాలి. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో అన్ని ప్రక్రియల ద్వారా పిల్లలకు న్యాయం దక్కాలి. రక్షణ కల్పించాలి. గౌరవ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు బాలల సంక్షేమ కమిటీలు, ఇతర అభివృద్ధి భాగస్వామ్య సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. ఇలాంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.





