కాంగ్రెస్‌కు సవాల్‌గా గత ఎన్నిక హామీలు ..!

జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సరిగ్గా 23 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ప్రజలకిచ్చిన హామీలు ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిబంధకమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ ఈసారి ప్రజల తీర్పును ఎవరూ అంచానా వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంవల్ల గెలుపు ఆ పార్టీకే లభిస్తుందన్న వాదన ఒకటుంది. అయితే కాంగ్రెస్‌ ‌గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందన్న విషయాన్ని బిజెపి, బిఆర్‌ఎస్‌లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ అయితే వినూత్న ప్రచారానికి తెరదీసింది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు ఏ మేరకు నష్టపోయారన్న విషయాన్ని ‘బాకీ కార్డు’ల రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు. ఈ కార్డును చూసిన వారికి నిజంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమకు ఏమేరకు బాకీ పడిందన్న విషయాన్ని ఆలోచింపజేసేదిగా ఉంది.

ప్రధానంగా రైతులకు అందిస్తామన్న రైతు భరోసా, రుణమాఫీ హామీలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వ్యవసాయరంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందనడానికి యూరియా కోసం రైతులు పడిన తంటాలు నిత్యం మీడియాలో కథలు కథలుగా రావడం రాష్ట్ర ప్రభుత్వంపై రైతాంగానికి ఆగ్రహం తెప్పించిన విషయం. గత ఎన్నికల్లో అడబిడ్డల పెండ్లిండ్లకు తులం బంగారం ఇస్తామన్నది వారిని బాగా అకట్టుకుంది. ఈ పథకాన్ని ప్రకటించడంద్వారా కాంగ్రెస్‌కు వోట్ల రూపంలో లబ్ధి పొందింది. దానితోపాటు వారికి 2500 రూపాయల పించను ఇస్తామన్న హామీకూడా వారిని బాగా ఆకట్టుకుంది.

వీటితోపాటుగా గృహజ్యోతి, పిల్లలకు స్కూటీలు, చివరకు బతుకమ్మ చీరల విషయంలోకూడా కాంగ్రెస్‌ ‌విఫలమైందన్న ప్రచారాన్ని బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మహిళకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని చూపించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వోట్లు దండుకోవాలని చూస్తున్నదని, కాని నిత్యం ఆ బస్సుల్లో మహిళ మధ్య పోట్లాటలు జరుగడాన్ని గమనించలేకపోతున్నదంటున్నారు. మహిళల్లో చాలామంది అసలు ఉచిత బస్సు సదుపాయం అవసరమేలేదన్న వాదన వినిపిస్తున్నారు. ఈ ఉచిత బస్సు కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోలేకపోతున్నదని ఆటో డ్రైవర్స్ ‌మండిపడుతున్నారు.

ఇదిలాఉండగా బీసీల విషయంలో కాంగ్రెస్‌ ‌పెద్ద ఎదురుదెబ్బ తాకింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ ‌కలిగించే విషయంలో కాంగ్రెస్‌ ‌పట్టుదలతోనే ఉన్నప్పటికీ చట్టంముందు నిలబడలేకపోతున్నది. స్థానిక ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని హాడావిడి చేసి, చతికిల పడిందన్న విమర్శలను కాంగ్రెస్‌ ఎదుర్కుంటున్నది. బీసీల పట్ల నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ బద్దంగా 42శాతం రిజర్వేషన్‌లను ఒప్పించేందుకు ప్రధానివద్దకు తీసుకువెళ్ళాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఇది అంతా ఒక ఎత్తు అయితే పార్టీలో అంతర్గత కలహాలు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌ ‌పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ విషయంలో మంత్రుల్లో కూడా బేదాభిప్రాయాలు ఉన్నాయి. మరింత డ్యామేజీ జరుగకుండా తాత్కాలికంగా ఈ వివాదాన్ని నిలువరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఈ ఎపిసోడ్‌ ‌డిఫెన్స్‌లో పడేసింది.
ఈ ఘర్షణ వెనుక వాటాల పంచాయితీ ఉందన్న అపవాదను ప్రభుత్వం మోయాల్సి వొస్తున్నది. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్షల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వర్గం దండుపాళ్యం ముఠాల వ్యవహరిస్తున్నదని వ్యాఖ్యానించడం గమనార్హం. వాటాలకోసం మంత్రులు వర్గాలుగా చీలిపోయారని ఆయన ఆరోపిస్తున్నారు. పాలనను గాలికొదిలి కాంట్రాక్టులకోసం, కమీషన్ల కోసం గొడవలు పెట్టుకుంటున్నారని ఆయన విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎన్నడూలేని విధంగా తుపాకుల సంస్కృతిని తీసుకొస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. వ్యాపారులను, పారిశ్రామికులను బెదిరించే సంస్కృతికి కాంగ్రెస్‌ శ్రీ‌కారం చుడుతున్నట్లుగా ఉందని. ఈ విషయాన్ని తానేదో కల్పించి చెప్పడంలేదని,  కాంగ్రెస్‌ ‌మంత్రి కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయాన్నే తాను గుర్తుచేస్తున్నానంటున్నారు హరీష్‌రావు. మొత్తంమీద జూబ్లీహిల్స్ ‌సమీపిస్తున్న నేపథ్యంలో  అధికార కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై అక్కడి వోటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page