– ఫార్మా సిటీ రద్దు చేస్తే భూములను తిరిగి ఎందుకివ్వరు?
– అనుముల బ్రదర్స్ కోసమే ఫ్యూచర్ సిటీ
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు ఇతర అవసరాలకు వాటిని మళ్లించడం అత్యంత నీచమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి నమ్మకద్రోహానికి మరో ఉదాహరణ ఫార్మా సిటీ అని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ఫార్మా రైతులకు భూములను తిరిగి ఎందుకు ఇవ్వడం లేదు.. వారితో ఎందుకు చర్చించడం లేదు అని ప్రశ్నించారు. అధికారం ఉందన్న అహంకారంతో ప్రజల అనుమతి లేకుండా భూముల సర్వే జరపాలనుకోవడం ఫాసిస్టు చర్య అని ఆయన అన్నారు. మా భూములు మాగ్గావాలె అని మర్లవడ్డ రైతులపై అక్రమ కేసులు పెడుతున్న రేవంత్ రాక్షసత్వాన్ని అడ్డుకుంటామన్నారు. ఫార్మా రైతులను నిలువునా ముంచి అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి నిర్మిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతలు మర్లవడుతున్నా, ఏకంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌కు బుద్ది రావడం లేదన్నారు. చట్టప్రకారం భూములను తిరిగి పొందే హక్కు ఉన్న రైతులతో ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఓవైపు ఫార్మా సిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మరోవైపు కొనసాగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ ప్రభుత్వం అటు ప్రజలను, ఇటు న్యాయస్థానాలను మోసం చేసిందన్నారు. ఫార్మా సిటీ రద్దయితే తమ భూములు తిరిగి వస్తాయని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొడుతున్న రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి వాతపెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. లగచర్ల గిరిజన రైతుల భూములు, కంచె గచ్చిబౌలి అటవీ భూములు, అనుముల బ్రదర్స్ కోసం ఇప్పుడు ఫార్మాసిటీ అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా.. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందన్నారు కేటీఆర్. అంతరించిపోయాయని అనుకున్న రాబందులు కాంగ్రెస్ నేతల రూపంలో తెలంగాణ ప్రజలను పీక్కు తింటున్నాయన్నారు. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భూములు తిరిగి ఇచ్చేవరకు రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.





