గోదావ‌రి నీళ్ల‌ను ఆంధ్ర‌కు అప్ప‌గిస్తున్నారు

– మిగులు జ‌లాల‌పై ప్ర‌భుత్వం నోరు విప్పాలి
– తెలంగాణ వాటా ఎంతో స్ప‌ష్టం చేయాలి
– ఫోన్ ట్యాపింగ్ అంటూ కుట్ర‌లు
-బీఆర్ ఎస్‌వీ స‌ద‌స్సులో కె.టి.ఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రను చంద్రబాబు,  రేవంత్ రెడ్డి అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే ఆ కుట్రను ఆపడానికి కేసీఆర్ ఉన్నాడన్న సంగతిని చంద్రబాబు మర్చిపోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ మల్లాపూర్ వీఎన్ ఆర్‌ గార్డెన్స్ లో శ‌నివారం జరిగిన బీఆర్ ఎస్‌వీ  విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న కేటీఆర్, తెలంగాణ జలాలు మనకు కాకుండా చేసే గద్ద పాత్రను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పోషిస్తున్న‌దని విమర్శించారు. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల గోదావరి మిగులు జలాల్లో 950 టీఎంసీలను దామాషా ప్రకారం తెలంగాణకు కేటాయించాక ఏపీలో ఏ ప్రాజెక్టు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అలానే 1486 టీఎంసీల గోదావరి నికరజలాల్లో 968 టీఎంసీలను తెలంగాణకు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న కేటీఆర్, కాంగ్రెస్, బిజెపి, చంద్రబాబు నాయుడు కలిసి  బీఆర్ఎస్ ను లేకుండా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నికృష్టంగా తయారైందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న రేవంత్ రెడ్డి కట్టు బానిసలైన పోలీసు అధికారుల పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చాక మిత్తీతో సహా చెల్లించి హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తామన్నారు. మొహబ్బత్ కా దుకాణ్ అంటూ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి సాగిస్తున్న విధ్వంసక పాలన కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతీ వర్గాన్ని మోసం చేసిన కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ పోరాడితేనే మూసీ ప్రక్షాళన, లగచర్ల, కంచె గచ్చిబౌలి అక్రమాలు ఆగాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *