– ఉద్యోగాల పేరుతో టోపీ పెట్టిన మోదీ, రేవంత్
- హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్న సీఎం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్25: దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆర్మూర్ నేలను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ, రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని రేవంత్ చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఇద్దరూ కలిసి ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆటలో అరటిపండుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి రాహుల్‌కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ఉస్మానియాలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం పునాది వేసిన భవనాలను ప్రారంభించారు. రేవంత్ రెడ్డి వికృత మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత ముఖ్యమంత్రులతో పోల్చి చూస్తూ ప్రజలు రేవంత్ రెడ్డిని బూతులు తిడుతున్నారు. మా ప్రభుత్వం నిర్మించిన భవనాలకు రిబ్బన్ కట్ చేయడానికి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే. పెట్టుబడులు, పరిశ్రమలు, విభజన హామీలు అన్నింటిలోనూ బీజేపీ తెలంగాణను మోసం చేసింది’ అని ధ్వజమెత్తారు. 20 నెలల కాంగ్రెస్ పాలన నచ్చకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా వోటు వేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు చేయించడం లేదు. మోదీ, చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి నీళ్లను దిగువకు పంపించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. గోదావరి నీళ్లు బకనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లాలని బీజేపీ ప్రభుత్వం రేవంత్‌కు ఆదేశాలిచ్చింది. అందుకే రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పగ పట్టారు. కాంగ్రెస్ పాలన వల్లే తెలంగాణలో యూరియా సంక్షోభం వచ్చింది. రేవంత్‌పై మాట పడకుండా బీజేపీ కాపాడుతోందని కేటీఆర్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





