– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ నేతలు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో విూడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ దగ్గర ఏడాదిన్నరగా పెండిరగ్‌లో ఉందని, ఆ పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉపఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్షా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును తప్పుపట్టేలా వ్యాఖ్యానించారు.. ఇపుడు ఉపఎన్నికలు ఎలా వస్తాయో సుప్రీం కోర్టు చెప్పింది అని వివేకానంద తెలిపారు. సీఎం అధికార మదంతో రాచరికాన్ని తలపించేలా మాట్లాడిన వ్యాఖ్యలకు విరుద్ధంగా తీర్పు ఇచ్చిందని, తీర్పుపై ఏ మాత్రం నమ్మకమున్నా పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. పార్టీ మారగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యత్వాన్ని కోల్పోయేలా చట్టం తెస్తామని ఏఐసీసీ మేనిఫెస్టోలో చెప్పింది.. పాంచ్ న్యాయ్ సూత్రాల్లో అది ఒకటని రాహుల్ చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన దానిపై ఏ మాత్రం గౌరవమున్నా రాహుల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం చొరవ చూపాలి అని వివేకానంద కోరారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు తమ పార్టీ తొలి విజయం.. ఈ విజయ పరంపర కొనసాగుతుందని వివేకానంద అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బుద్ది తెచ్చుకుని వ్యవహరించాలి అని హితవు పలికారు.





