– స్వామిని దర్శించుకున్న మంత్రులు సురేఖ, పొన్నం
– బండ్లు కట్టి భారీగా తరలివచ్చిన భక్తజనం
హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 16: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతు న్నాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి కోరికలు తీర్చాలని స్వామివారికి కోర విూసాలు సమర్పించుకున్నారు. తమ గండాలు తొలగిపోవాలని గండ దీపంలో నూనె పోశారు. కోడె ప్రదక్షిణ చేశారు. గుమ్మడికాయ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటలతరబడి క్యూ కట్టారు. శీఘ్ర దర్శనం, వీఐపీ క్యూలైన్లు సైతం కిక్కిరిసిపోయాయి. మకర సంక్రాంతి పర్వదినం గురువారం అర్ధరాత్రి ఆనవాయితీ ప్రకారం వరంగల్ జిల్లా వేలేరుకు చెందిన యాదవులు డప్పు చప్పుళ్ళు, శివసత్తుల నృత్యాల మధ్య మేకల బండితో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఎడ్ల బండ్లతో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గుట్టపైన కొలువుదీరిన వీరభద్ర స్వామి ఆత్మలింగం ఆలయంలో దివ్యాలంకరణ పూజలు జరిగాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలోని ఆయన ఇంటి నుంచి కొత్తకొండకు ఎడ్ల బండి రథం ఏటా మకర సంక్రాంతి రోజున రావడం అనవాయతీ. శివ సత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల నడుమ రథాన్ని కొత్తకొండకు గ్రామస్తులు అంగరంగ వైభవంగా సాగనంపారు. బండెనుక బండి కట్టి.. అన్న చందంగా కొత్తపల్లి నుంచి కొత్తకొండకు వెళ్లిన ఎడ్ల బండ్లు రథాలను తలపించాయి. సుమారు 72 ఎడ్ల బండ్లను బంతిపూలతో అలంకరించి రథాలుగా తీర్చిదిద్దారు. ఎడ్ల బండి రథాలను తిలకించేందుకు ప్రజలు దారి వెంట బారులు తీరారు. హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ఎడ్ల బండ్లతో వచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన మంత్రులు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు వారికి శేష వస్త్రాలు సమర్పించి స్వామి వారి మెమెంటోను ప్రదానం చేశారు. అంతకుముందు మంత్రులు త్రిశూల చౌరస్తాను ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తకొండ ఆలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధులు, ఇతరత్రా అభివృద్ధి పనుల కోసం రూ.70 కోట్లు మంజూరు చేసిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జూదం, మట్కా, గుట్కా, నాటుసారాలను పూర్తిస్థాయిలో నియంత్రించారు. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, మరో ఇద్దరు ఏసీపీలు, పదిమంది సీఐలు, 25మంది ఎస్సైలు, 350మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





