మంత్రి సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

– కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో
– నాంపల్లి కోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుతోపాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు గుర్తించిన కోర్టు ఫోన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌తోపాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కె.తారకరామారావుపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి సురేఖపౖౖె క్రిమినల్‌ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపుఆమెకు నోటీసులు జారీ చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు పట్టించుకోలేదు. కేటీఆర్‌ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్‌ స్టేషన్‌ పరిధి తదితర అంశాలపై లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది. మంత్రి చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్‌ తరపు న్యాయవాది సిద్ధార్థ్‌ పోగుల చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితురాలిపై కేసు నమోదు చేయొచ్చని తేల్చిచెప్పింది. ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని, హైకోర్టు ఆదేశం (క్రిమినల్‌ పిటిషన్‌ నెం. 5670/2024) ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. సురేఖ వ్యాఖ్యలు, అడ్డగోలుగా చేసిన ఆరోపణలు ఇంతకుముందే మీడియాలో వచ్చాయనడానికి ఎలాంటి ఆధారం లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలు, ఆమె స్వయంగా చేసినవిగా సూచిస్తున్నాయని కోర్టు నిర్ధారించింది. ఈ పెన్‌డ్రైవ్‌కు సెక్షన్‌ 65-బి సర్టిఫికేట్‌ అవసరమన్న వాదన ఈ దశలో అప్రస్తుతమని, విచారణ సమయంలో దానిని చట్టపరంగా పరిశీలిస్తామని తెలిపింది. ఎందుకంటే పెన్‌ డ్రైవ్‌లోని విషయాలను పరిశీలించే దశ ఇంకా రాలేదని, ఒకవేళ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఉంటే విచారణ సమయంలో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ పరిశీలనల ఆధారంగా, సెక్షన్‌ 222 రెడ్‌విత్‌ 223 బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద సెక్షన్‌ 356 బీఎన్‌ఎస్‌ ప్రకారం నేరాన్ని స్వీకరించి దీనిని క్రిమినల్‌ కేసుగా నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *