జాగృతి కవిత ఎవరో తెలియదు

– బీసీ రిజర్వేషన్ల ఆమె ధర్నా ఓ జోక్‌
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు
– నల్లగొండలో క్యాంప్‌ కార్యాలయానికి ఇందిరా భవన్‌గా నామకరణం
– ఫోన్‌ చేసి అభినందించిన సీఎం

నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్‌ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతాం.. ఆర్డినెన్సును సాధిస్తామన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. క్యాంప్‌ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘క్యాంప్‌ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశాం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో మొదటి ఏడాది నేను బాధపడ్డాను.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఆనందంగా ఉంది.. కాంగ్రెస్‌లో అందరూ సమానమే.. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తిచేస్తాం’ అని చెప్పారు. కేబినెట్‌లో జరగబోయే చర్చపై తాను ముందుగా మాట్లాడలేనన్నారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులు జైలుకు వెళ్తారు.. ఏపీ తలపెట్టిన బనకచర్లను కట్టనివ్వం.. కాళేశ్వరం నివేదికపై కేబినెట్‌లో సమగ్రంగా చర్చిస్తాం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు.. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం అని వివరించారు. బనకచర్లపై అవసరమైతే కేంద్రంపై కొట్లాడుతాం.. దాని నిర్మాణాన్ని అడ్డుకుంటాం అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

మీరు సీఎం కావాలని పూజలు చేశా

సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడగా స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడుతూ మీరు మరలా సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశానని మంత్రి తెలిపారు. అందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. క్యాంప్‌ కార్యాలయానికి ఇందిరా భవన్‌గా నామకరణం అనంతరం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను, భూమి పూజకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమాలకు నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కందూరు జైవీర్‌ రెడ్డి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *