– ఆయన స్ఫూర్తిని ముందు తరాలకు తెలియజేయాలి
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా ప్రత్యేక జీవో ఇచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గిరిజన ఐక్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై మంగళవారం జరిగిన కొమరం భీమ్ 85వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆమెకు ఆదివాసీ సంప్రదాయ డప్పు కళాకారులు ఘన స్వాగతం పలికారు. భీం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మంత్రి సీతక్క
జోహార్ కొమరం భీం.. కొమరం భీం ఆశయాలను సాధిస్తాం అంటూ నినదించారు. అనంతరం ప్రసంగిస్తూ మా గూడేల్లో మా రాజ్యం కావాలి.. మా ఆడవుల మీద మాకు హక్కు ఉండాలి.. జల్ జంగల్ జమీన్‌పై అధికారం ఆదివాసులకు ఉండాలంటూ ఆయన పోరాటం చేశారని తెలిపారు. ఫలితంగానే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తొలి ప్రధాని నెహ్రూ ఆదివాసీ గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారన్నారు. కొమరం భీం స్ఫూర్తితో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటయిందని, రాజ్యాంగంలో ఈశాన్య రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారని, మైదాన ప్రాంత రాష్ట్రాల్లోని ఆదివాసీల పరిరక్షణ కోసం షెడ్యూల్ 5ను చేర్చారని గుర్తు చేశారు. ఐటీడీఏల ఏర్పాటులోనూ భీం స్ఫూర్తి ఉందంటూ ఆదివాసీల అభివృద్ధితోనే ఆయన ఆశయాలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. గిరిజన ఆదివాసిల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గిరిజన ప్రాంతాల్లో వారికి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని చెప్పారు. సోనియా గాంధీ నాయకత్వంలో పోడు హక్కులు కల్పించారని, ఉద్యోగాల భర్తీలోనూ ప్రత్యేక హక్కులు కల్పించామని, ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు. అందరికీ భూములు, ఇండ్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే కొమరం భీం ఆశయాలను సాధించిన వాళ్ళమవుతామన్నారు. భీం స్ఫూర్తితోనే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం సాగిందని చెప్పారు. సమాజం కోసం పాటుపడిన వారి త్యాగాలను గుర్తు చేసుకుని వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందజేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





