కొల్లూరు కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

– విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత: పొంగులేటి 
– సంక్రాంతినాటికి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కొల్లూరు కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య అధ్యక్షతన కొల్లూరు డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీలో విఎస్‌టి కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధులు రూ.8 కోట్లతో నిర్మించనున్న 60 గదుల పాఠశాల, డైనింగ్‌ హాల్‌, అంగన్‌వాడి కేంద్రం నిర్మాణం పనులకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్‌లు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కొల్లూరు డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీ భవిష్యత్తులో ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సుమారు 15 వేల కుటుంబాలకు చెందిన లక్షమంది ప్రజలు నివాసముండేందుకు వీలుగా కాలనీలో అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. కాలనీలో ప్రహరీ నిర్మాణం, క్రీడా మైదానం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాలనీ నుండి నాంపల్లి, చార్మినార్‌, హైదరాబాద్‌ వైపు బస్సు సౌకర్యం లేదని కాలనీవాసులు తెలపగా నాలుగు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కాలనీలో పాఠశాల భవన నిర్మాణానికి విఎస్‌టి కంపెనీ ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈనెల 10 నుంచి సన్న బియ్యం అందేలా చర్యలు చేపడతామని, పోలీస్‌ ఔట్‌ పోస్టును ఏర్పాటు చేస్తామని, దీనికోసం తమ హౌసింగ్‌ శాఖకు చెందిన భవనాన్ని పోలీసు శాఖకు ఇస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లో పోలీసు పోస్టు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు పనిచేయని సీసీ కెమెరాలకు వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దామోదర మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నదన్నారు. ప్రత్యేక కమ్యూనిటీలకు చెందిన కుటుంబాలకు చెందిన సుమారు లక్షమంది ప్రజలు కాలనీలో నివాసం ఉంటున్నారని, కాలనీలో నివాసం ఉండే వారికి విద్య, వైద్య పరంగా అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. సంక్రాతికి కాలనీలో ఆరు పడక గదుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు తెల్లాపుర్‌ టు బీహెచ్‌కే కాలనీలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మంత్రులు కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. బీఎస్‌కే కాలనీలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తొందరపడి తమ ఇండ్లను అమ్ముకోవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి గౌతమ్‌ అన్నారు. కాలనీలో ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయడం లేదన్నారు. కొల్లూరు టు బీఎస్‌కే కాలనీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రుల సహకారంతో కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలు అందించే సీఎస్‌ఆర్‌ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రుల సహకారంతో కాలనీలో ఆయా శాఖలపరంగా చేపట్టాల్సిన అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాలనీలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపార. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *