– ఈ కంపెనీకి వేల కోట్లు దోచిపెడుతున్న రేవంత్
– కంపెనీ వ్యవహారాలపై సుప్రీంకోర్టు నోటీసులు
– దివాలా తీసిన కంపెనీతో వందల కోట్ల లావాదేవీలేంటి?
– వేల కోట్ల కాంట్రాక్టులెట్లా ఇస్తారు?
– కంపెనీపై సమగ్ర విచారణ జరపాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: రేవంత్ బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్న అంశంతోపాటు అర్హత లేకుండా కాంట్రాక్టులు సాధిస్తున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ కంపెనీ వ్యవహారాలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. మరోవైపు ఈ అంశంలో సీబీఐ, ఈడి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలతో విచారణ చేయించాలని కేంద్రానికి కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ తన బినామీ కంపెనీకి నోటీసుల అంశాన్ని దాచి ఉంచడం, రేవంత్ రెడ్డికి కెఎల్ఎస్ఆర్ ఏవిధంగా బినామీనో ఆధారాలతో బయటపెట్టారు. తాజాగా ఈ కంపెనీ న్యాయమూర్తులను మేనేజ్ చేసే విషయం మొదలుకొని దివాలా తీసిన ఈ కంపెనీలో కొనసాగుతున్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీలపైన నిగ్గుతేల్చాలని సుప్రీంకోర్టు వారం కింద రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, అనుబంధం, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన అనుచిత లబ్ధి, కట్టబెట్టిన వేల కోట్ల కాంట్రాక్టు అంశాన్ని వివరించారు. ఈ కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కారును ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాడుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కంపెనీపై 2018 లోనే ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ దాడులు చేశాయని, అప్పుడే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలా ప్రక్రియ కేసు నడుస్తున్న ఈ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి భుజాల మీదకు ఎత్తుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి బంధువులపైన ఐటీ రైడ్స్ జరిగినాయి. సాయిమౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, కెఎల్ఎస్ఆర్ మధ్య నిధులు చేతులు మారిన విషయాన్ని, టాక్స్ ఎగవేతలను ఈ దాడుల సందర్భంగా గుర్తించారు. భూపాల్ ఇన్‌ఫ్రా, సాయి మౌర్య కంపెనీల డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండు కంపెనీలు రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈ కంపెనీ కెఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ ఒక బినామీ కంపెనీ అని అందరికీ తెలుసన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి కాకముందు బినామీ కంపెనీల మాస్టర్‌గా పనిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ నేతలకు బినామీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కుంభకోణాలపై రేవంత్ దాటవేత ధోరణి
రెండేళ్ల కాలంలో అనేక కుంభకోణాలను ప్రధాన ప్రతిపక్షంగా బయటపెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి దాటవేత ధోరణితో వ్యవహరించారన్నారు. 2023 జులై 23న ఈ కంపెనీకి మరో కంపెనీ ఏఎస్ఎంఈటి మధ్య గొడవ జరిగిందని, వారిద్దరూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను అప్రోచ్ అయ్యారని, ఆ తర్వాత కేసు నడుస్తున్నదని తెలిపారు. తర్వాత కెఎల్ఎస్ఆర్ అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ పిటిషన్ వేసి తాము దివాళా తీసిన విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, దాంతో ఈ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్.సి.ఎల్.టి నిషేధించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కేసు విషయంలో ఎన్.సి.ఎల్.టి, ఒక ఉన్నత న్యాయస్థానానికి చెందిన జడ్జ్ ద్వారా జస్టిస్ శరత్ కుమార్ పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఆ విషయాన్ని బయటపెట్టి ఆ కేసు నుంచి తప్పుకున్నారని కేటీఆర్ తెలిపారు. అయితే ఎన్‌సిఎల్ టిలోనూ జడ్జిల ద్వారా కంపెనీకి సానుకూలంగా తీర్పు వచ్చేలా నిలబడిన వ్యక్తి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. కెఎల్ఎస్ఆర్ లో రేవంత్ అనేక పెట్టుబడులు పెట్టాడని, అందుకే రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన సాయి మౌర్య అనే కంపెనీతో లావాదేవీలు నడిపిందన్నారు. కెఎల్ఎస్ఆర్ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భారీగా భూములు కొనుగోలు చేసే పని చేసిందని కేటీఆర్ తెలిపారు. 2018లో ఈడీ కూడా ఈ కంపెనీ మీద దాడి చేసి అనేక ఆధారాలు బయటపెట్టిందన్నారు. ఇంత దుర్మార్గమైన, నీచమైన చరిత్ర ఉన్న కెఎల్ఎస్ఆర్ కి, దివాళా తీసిన కెఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డి హయాంలో రూ.6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని, అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్ పనులు, రహదారుల పనులను ఈ కంపెనీ ఎలా పొందిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని పురపాలక శాఖతోపాటు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కంపెనీ భారీగా పనులు దక్కించుకున్నదన్నారు. అయితే 2023 నుంచే దివాళా తీసిన కంపెనీకి 2024-26 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కెఎల్ఎస్ఆర్ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రూ.15 లక్షలు కూడా లేవని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నదని, అంతటి ఆర్థిక వనరులు లేని కంపెనీ వేల కోట్ల కాంట్రాక్టులకు సంబంధించిన వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలను ఎందుకు, ఏ విధంగా సబ్మిట్ చేస్తుంది అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, ఆ మేరకు జడ్జిని ప్రభావితం చేసే అంశంతోపాటు ఈ కంపెనీలోకి వచ్చిన వందల కోట్ల నిధుల విషయం పై విచారణ జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిందన్నారు. అందులో భాగంగానే సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ ఎఫ్ ఐఓ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కోరుతూ నోటీసు కూడా ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఈ రూ.6,000 కోట్ల స్కామ్‌తోపాటు కంపెనీకి సంబంధించిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చిన అనుచిత లబ్ధిపై దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రానికి ఇచ్చిన నోటీసులను ముఖ్యమంత్రి ఎందుకు దాచి ఉంచారని కేటీఆర్ ప్రశ్నించారు. దివాళా తీసిన కంపెనీపై రేవంత్ కి ఎందుకు ఇంత అమితమైన ఆసక్తి ఉన్నదని, ఇది కేవలం కమీషన్ల కోసమా లేక భాగస్వామ్యం కోసమా లేక అక్రమ సంపాదన ఆ కంపెనీ ద్వారా పంపించుకోవడానికా, లేకుంటే ఆ కంపెనీ స్వయంగా రేవంత్ రెడ్డిదా అన్న విషయం తేలాల్సిన అవసరం ఉన్నదని, ఈ అంశం పైన రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానం చెప్పాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినట్లు రాష్ట్రంలో సీబీఐ తో ఈ అంశంలో వెంటనే ఎంక్వయిరీ నిష్పాక్షికంగా జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కెఎల్ఎస్ఆర్ కి రాష్ట్రంలో ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యేదాకా ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి నూతన కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే సీబీఐ, ఈడీ ద్వారా విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కిషన్ రెడ్డి స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు నోటీసులను పక్కనపెట్టి కిషన్ రెడ్డి, బిజెపి రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కేవలం అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం మాత్రమే కాకుండా మనీ లాండరింగ్ మీద కూడా ముఖ్యమంత్రి పాత్ర ఉందని ఈ అంశంపై కేంద్ర ఏజెన్సీలు విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





