అవగాహన కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతకు తెలంగాణ పోలీసు శాఖ సూచనలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను పోలీస్ శాఖ పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించవు. ముందున్న వాహనం లేదా ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో, డ్రైవర్లు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది.
*చలి కాలంలో డ్రైవర్లు తీసుకోవలసిన కీలక జాగ్రత్తలు*
*1.ముందుగానే ప్రయాణం మొదలుపెట్టండి* పొగమంచు వలన ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, నిర్ణీత సమయం కంటే కొద్దిగా ముందుగానే బయలుదేరండి. తొందరపాటును నివారించడం ద్వారా డ్రైవింగ్ పై ఏకాగ్రత పెరుగుతుంది.
*2.అతివేగం, ఓవర్ టేకింగ్‌కు దూరంగా ఉండండి* ముందున్న వాహనాలు, రోడ్డు స్పష్టంగా కనిపించనందున అతివేగం, ఓవర్ టేకింగ్ అత్యంత ప్రమాదకరం. వేగంగా వెళ్లడం వలన వాహనం నియంత్రణ (కంట్రోల్) తప్పే ప్రమాదం ఉంది. ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు ఎదురుగా ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టం.
*3.లో-బీమ్ లైట్లనే వాడండి* పొగమంచులో హై-బీమ్ లైట్ల నుండి వచ్చే కాంతి విచ్ఛిన్నమై, ఎదురుగా చూడటం మరింత కష్టమవుతుంది. కాబట్టి, తప్పనిసరిగా లో-బీమ్ (Low-Beam) హెడ్లైట్లను మాత్రమే వాడండి. ఫాగ్ లైట్లు (Fog Lights) ఉన్న యెడల, వాటిని కూడా ఉపయోగించాలి. ఇది మీ వాహనం ఎంత దూరంలో ఉందో ఇతరులకు స్పష్టంగా తెలుపుతుంది.
*4.సురక్షిత దూరాన్ని పాటించండి* ముందు ఉన్న వాహనానికి, మీ వాహనానికి మధ్య తగినంత సురక్షిత దూరాన్ని (Safety Distance) ఉంచండి. దీనివలన ముందు వాహనం సడన్ బ్రేక్ వేసినా, అంచనా తప్పినా దాన్ని ఢీకొట్టకుండా నివారించవచ్చు.
*5.నిర్దేశించిన లేన్లలోనే నడపండి* ఇష్టం వచ్చినట్లు లేన్ క్రమశిక్షణ లేకుండా నడపడం వలన ముందున్న వాహనాలను గుర్తించడం కష్టమవుతుంది. నిర్దేశించబడిన లేన్లలో మాత్రమే వాహనాన్ని నడపండి. *6.కిటికీ అద్దాలను కొద్దిగా దించండి* వాహనాన్ని నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించడం వలన (పాక్షికంగా తెరవడం), పొగమంచు ఒకేదగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నమవుతుంది. దాని వలన డ్రైవర్ దృష్టి మెరుగు పడుతుంది.
*7.ఎక్కువ పొగమంచు ఉంటే వాహనం ఆపండి* కొన్నిసార్లు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ముందు ఉన్న వాహనాలు, రోడ్డు సరిగ్గా కనిపించకపోతే, గమ్యస్థానానికి వెళ్లాలనే తొందరలో తప్పులు చేయకుండా, సురక్షిత ప్రదేశంలో కాసేపు వాహనాన్ని ఆపివేసి, మళ్లీ ప్రయాణం కొనసాగించండి.
*8.అద్దాలను శుభ్రంగా ఉంచుకోండి* పొగమంచు అద్దాలను కవర్ చేయడం వలన డ్రైవర్ దృష్టి తగ్గుతుంది. మీ వాహనం యొక్క ముందు, వెనుక కిటికీ అద్దాలను శుభ్రంగా ఉంచుకోండి. అవసరాన్ని బట్టి వైపర్లను, డీఫ్రాస్టర్లను వాడుతూ అద్దాలను స్పష్టంగా ఉండేలా చూసుకోండి.
*9.ఇండికేటర్లను ముందుగా ఉపయోగించండి* మీరు ఎటువైపు వెళుతున్నారో వెనుక వచ్చే వాహనానికి ముందుగానే తెలిసేలా ఇండికేటర్లను (Indicator lights) ముందుగా ఉపయోగించండి. వెనుక వచ్చే డ్రైవర్లకు నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఇచ్చేలా సంకేతం అందించండి.
*10.సడన్ బ్రేకింగ్ నివారించండి* చలికాలంలో రోడ్డు తడిగా ఉండి, వాహనాలు స్కిడ్ (Skid) అయ్యే ప్రమాదం ఎక్కువ. బ్రేకులను నెమ్మదిగా, జాగ్రత్తగా అప్లై చేయండి. సడన్ బ్రేకులు వేయడం వలన వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంది. నిర్దిష్టమైన వేగంతో వాహనాలను నడపడం ద్వారా స్కిడ్ కాకుండా నివారించవచ్చు. తెలంగాణ పోలీసు శాఖ చేసిన ఈ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించి, తమ ప్రయాణాన్ని సురక్షితంగా, విజయవంతంగా ముగించాలని విజ్ఞప్తి చేసింది,





