కేసీఆర్‌ అప్పు.. ‌తెలంగాణ భవిష్యత్తుకు ముప్పు

బిఆర్‌ఎస్‌ అభివృద్ధి గాలి బుడగ
అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
నాటి ఆర్టీసీ సమ్మెతో ఎంతో మంది చనిపోయారు
కెసిఆర్‌ ‌నిర్వాకంతోనే నెలకు 6వేల కోట్లు వడ్డీ కడుతున్నాం
కెటిఆర్‌ ‌వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీతక్క, చామల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 6: గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్‌ అప్పు.. ‌తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్‌ ‌నిర్వాకంతోనే నెలకు రూ.6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వొస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌పై మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వీరు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్‌ ‌తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.

సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్‌ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వొచ్చి సత్తా నిరూపించుకోవాలని హితువు పలికారు. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దని అంటూ మండిపడ్డారు. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగులగొట్టింది ఎవరు అని కేటీఆర్‌ ని నిలదీశారు. ఎందరో ఉద్యమకారులను అవమానపరిచి బయటకు పంపిన చరిత్ర గులాబీ పార్టీదని మండిపడ్డారు. అప్పులు, అమ్మకాలు తప్ప బీఆర్‌ఎస్‌ ‌చేసిన అభివృద్ది శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ‌చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారన్నారు. బీఆర్‌ఎస్‌ అప్పు‌ల మూలంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

కేటీఆర్ కు మైండ్ బ్లాంక్ అయింది..
కేటీఆర్‌కు మైండ్‌ బ్లాంక్ అయిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం మాట్లాడారని.. కేటీఆర్‌కు మెడ, కాళ్ల నొప్పులు దెబ్బకే పోయాయంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సమ్మె చేయొద్దు.. రాష్ట్రం బాగు చేసుకుందామని సీఎం చెప్పారని.. గతం లో 52 రోజులు సమ్మె చేస్తే.. కేసీఆర్‌ ఒక్క రోజు బయటికి రాలేదని గుర్తు చేశారు. సమ్మె చేస్తున్న వారిని నానా బూతులు తిట్టాడని తెలిపారు. ఉద్యోగ సంఘం నేతలను మాట్లాడకుండా చేశారని మండిపడ్డారు. మిగులు రాష్ట్రాన్ని ఇస్తే రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం సీఎం చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నడూ కేటీఆర్‌ ఊరికే లేరని.. ప్రతీరోజు తప్పుడు ప్రచారమే చేశారని ఫైర్‌ అయ్యారు.  బీఆర్‌ఎస్‌ ‌హయాంలో దోచుకున్నదే కాకుండా.. మళ్లీ వొచ్చే వాళ్లు పరిపాలన చేయకుండా చేశారన్నారు. ’తెలంగాణ ప్రజలకు లెక్కలు తెలీవని అనుకుంటున్నావా కేటీఆర్‌…  ‌హయాంలో ఒకటో తారీకు జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా. లక్ష 50 వేల కోట్లు అప్పు కట్టాం. మిస్‌ ‌వరల్డ్‌కు ఖర్చు రూ.250 కోట్లు కాదు..

రూ.27 కోట్లే.. కేటీఆర్‌.. ‌దోపిడీలో భాగస్వామి. తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదు. మీరు దోచుకున్నంత దేశంలో ఎవరూ దోచుకోలేదు. కేటీఆర్‌కు సిగ్గు శరం లేదు. కాళేశ్వరంలో ఓ అధికారి జైలుకి వెళ్ళాడు. మీరు చెప్తేనే కరెక్ట్ అనేది దుర్మార్గపు ఆలోచన. నీ పగటి కలలు నెరవేరవు. రేపటికి రేపు సీఎం కుర్చీలో కేటీఆర్‌ ‌కూర్చోలేడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేసినందుకు రాహుల్‌ ‌క్షమాపణ చెప్పాలా. మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదు. ఆర్టీసీ సమ్మె 52 రోజులు జరిగితే ఎందుకు మాట్లాడలేదు. రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ఇల్లు వద్ద పార్కింగ్‌ ‌లేక ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్‌ ‌చెప్పిన 2000 ఎకరాలు తీసుకురావాలి. ఆ 2000 ఎకరాలు బయటపెట్టాలి. పిట్ట కథలు చెబుతుండు. చెల్లెను బయటకు పంపాలి.. బావను పడుకోబెట్టాలి అని చూస్తుండు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్‌ ‌మాటలు నమ్మొద్దని ఎంపీ చామల కిరణ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *