- ఎవరికి వారే మాదంటే మాదేనని ప్రచారం
- 80 శాతం స్థానిక కోటాపై పెరుగుతున్న డిమాండ్
- అట్టడుగున పడిపోయిన ఓ చారిత్రక పోరాట ఫలితం!
( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
త్వరలో ప్రారంభం కానున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పోటీపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదేకాదని బీజేపీ అంటోంది. ఏదిఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ కోచ్ ఫ్యాక్టరీ రావడమన్నది ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితమన్నది స్పష్టం. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో నాటి వరంగల్ జిల్లా పారిశ్రామికంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. స్వాతంత్య్రానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క భారీ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయాయి. స్వాతంత్య్రానికి పూర్వం నాటి నిజాం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆజంజాహి బట్టల మిల్లును నడువదని ముద్రవేసి, దానికున్న రెండు వందల ఎకరాలకుపైగా స్థలాన్ని గజాల లెక్కన ప్రభుత్వం అమ్మేసుకుంది. అప్పటినుండి ఉమ్మడి వరంగల్‌జిల్లాలో కార్మికులకు ఉపాధికరువైంది. పెద్ద చదువులు చదువలేకపోయినవారికి ఆ నాటినుండి నేటి వరకు ఉపాధి అవకాశాలు కొరవడినాయి. అనేక ఉద్యమాలు, నిరాహారదీక్షలు ఎన్నిచేసిన గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశలో చేసిన ప్రయత్నాలేవీలేవు. ఎట్టకేలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దశాబ్దకాలం తర్వాత కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయం జరిగింది. అది ఇంకా తుదిమెరుగులు దిద్దుకుంటున్నది.
మరికొద్ది రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ఇటీవల కాజీపేటలో ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా తెలిపారు. అయితే దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీలో స్థానికులకే అవకాశాలు అధికంగా కల్పించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. వాస్తవంగా అర్ధ శతాబ్ధానికి పైగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఎలాంటి ఉపాధి అవకాశాలులేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనేక మంది ఉపాధికోసం ఊరువిడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ‘కొలువుల కోసం కొట్లాట’ నినాదంగా శనివారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి టి. హరీష్‌రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంవల్లే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నెలకొల్పడానికి అవకాశంఏర్పడిందనడంతో ఆక్రెడిట్ బిఆర్‌ఎస్ ఎక్కడ కొట్టేస్తుందో అన్నట్లుగా కాంగ్రెస్ విరుచుకు పడుతోంది. స్థానిక ఎంఎల్‌ఏ నాయిని రాజేందర్‌రెడ్డి హరీష్‌రావు మాటలను తప్పుపట్టారు. వాస్తవంగా విభజన హామీల్లో ఈ అంశాన్ని పొందుపర్చింది సోనియాగాంధీనేనంటూ క్రెడిట్ కాంగ్రెస్‌కే దక్కుతుందంటున్నారు. గడచిన పదేళ్ళకాలంలో బీఆర్‌ఎస్ బిజెపితో అంటకాగినప్పటికీ ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేక పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. కాని, దానికి కావాల్సిన భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అందించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనంటున్న మాజీ విప్, ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వినయభాస్కర్ ఫ్యాక్టరీకి చెందిన 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు.
కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న విషయం 1969 తెలంగాణ ఉద్యమానికన్నా ముందునుండే డిమాండ్‌లో ఉంది.అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. నాటి వరంగల్ జిల్లాలోని అన్ని రాజకీయపార్టీలు, విద్యార్దులు, నిరుద్యోగులు, కార్మికులు ఇక్కడ ఫ్యాక్టరీకోసం అనేక పోరాటాలు చేశారు. దానికి కేంద్రం తలొగ్గి 1982లో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కాని నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యతో పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లను అణచడంలో భాగంగా ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాలో ఏర్పాటుచేసింది. అయినా ఇక్కడ ఉద్యమాలు కొనసాగుతుండడంతో 2010-11 ప్రాంతంలో మరోసారి కేంద్రం హామీ ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ మలివిడుత ఉద్యమంలో ఇదికూడా ప్రధానాంశం కావడంతో, ఏపీ పునర్విభజన చట్టంలో దీన్ని పొందుపర్చారు. కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దాదాపు పదేళ్ళకు 2023లో ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేశారు. అయితే ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఖాయమే అయినా దాని పేర్ల విషయంలో చాలాకాలంగా గందరగోళం ఏర్పడింది. కొద్దికాలం దీన్ని వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాపన్నారు. తర్వాత వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ అన్నారు. మరికొంతకాలం పిరియాడికల్ ఓవరాలింగ్ వర్క్‌షాపుగా పేర్కొన్నారు. ఇప్పుడేమో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అంటున్నారు. ఏదిఏమైన త్వరలో ఈ ఫ్యాక్టరీలో పనులు ప్రారంభం కానుండగా ఇక్కడ దశాబ్ధాలకాలం పోరాటాలు చేసిన స్థానికులకు 80 శాతం అన్ని విభాగాల్లో ఉద్యోగాలను కల్పించడం సముచితంగా ఉంటుంది. నేటి వరకు ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన ఒక్క ఫ్యాక్టరీ లేకపోవడంతో స్థానిక కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనివల్ల కనీసం పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభించే అవకాశాలున్నందున, ఈ ఫ్యాక్టరీ ప్రారంభంకోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు.
—–





