– పాదయాత్రకు సన్నాహాలు
– అంతా కెసిఆర్ డైరెక్షన్లోనే
– బాంబు పేల్చిన బిజెపి ఎంపి రఘునంద్ రావు
తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్ ఎంపి రఘునందన్ రావు జోస్యం చెప్పారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనుందన్నారు. తుఫ్రాన్ లో రఘునందన్ రావు పర్యటించారు. ఆయన మంగళవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. మాజీ సిఎం కెసిఆరే కవితతో పార్టీ పెట్టిస్తున్నారని ఆరోపించారు. తండ్రి, కుమార్తె మధ్య మధ్యవర్తులెందుకని ప్రశ్నించారు.
కవిత గెలిచినప్పుడు కెసిఆర్ దేవుడయ్యారని, ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారని విమర్శించారు. దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకని రఘునందన్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ లేఖపై ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అలాంటి వేళ మెదక్ ఎంపీ , బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి స్పందించారు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్‌లో నిర్వహించారు. ఈ సభకు పార్టీ నేతలతోపాటు కార్యకర్తలంతా భారీగా తరలి వచ్చారు.
అనంతరం ఈ సభలో తన తండ్రి కేసీఆర్ ప్రసంగంతోపాటు కొన్ని అంశాలతో కూడిన లేఖను ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాశారు. అయితే ఈ లేఖ ఇటీవల సోషల్ డియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వరుసగా సమావేశమవుతున్నారు.
మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఎదుట హాజరుకావాలంటూ కేసీఆర్‌తోపాటు హరీష్ రావు, ఈటల రాజందర్లకు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ బీఆర్ఎస్ చీఫ్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ టాపిక్ డైవర్షన్ కోసమే ఈ లెటర్ పాలిటిక్స్ అనే ఓ చర్చ సైతం రాష్ట్రంలో కొనసాగుతోంది.





